సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా.. సతీమణి సుజాత, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సతీమణి, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేతలు ఇప్పుడు రాజ కీయంగామంచి స్వింగ్‌లో ఉన్నారు. తమ కుటుంబాల్లోని పురుష నేతలతో సరి సమానంగా వారు రాజకీయాల్లో రాణించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. పైగా ఈ ముగ్గురూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం.. ఉన్నత విద్య చదివిన వారు కావడం, రాజకీయంగా దూకుడుగా ముందుకు సాగడం వంటివి మహిళా నేతలుగా వారిని ప్రాధాన్యం పెంచుతోంది. బొండా ఉమా కాపు వర్గానికి చెందిన నేత అయినా భార్య సుజాత కమ్మ వర్గానికి చెందిన వారే.
ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఈ ముగ్గురు మహిళా నేతలు ఎవరికి వారుగానే రాజకీయాలు చేసుకోవడం. వాస్తవానికి అనురాధ.. గతంలో జెడ్పీ చైర్ పర్సన్‌గా చేయడంతో పాటు ఐదేళ్ల పాలనలో తన ముద్ర వేశారు. బొండా సుజాత, కేశినేని శ్వేతలు మాత్రం గత ఎన్నికల సమయంలోనే రోడ్డు మీదకు వచ్చారు. అది కూడా విజయవాడ మేయర్ స్థానం మహిళకు రిజర్వ్ కావడంతో ఈ ముగ్గురు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకున్నారు. ఇప్పటికే చంద్రబాబు.. శ్వేతకు మార్కులు వేశారు. కానీ, ఏ నిమిషంలో ఎలాంటి మార్పు వస్తుందో.. ఏదైనా తేడా వచ్చినా.. మార్పు ఆశించినా.. తమకు కూడా అవకాశం చిక్కే ఛాన్స్ ఉంటుందని బొండా సుజాత, గద్దె అనురాధ ఆశలతో ప్రజల్లోకి వస్తూ తమ భర్తలకు అండగా ఉంటున్నారు.
తమ భర్తల నియోజకవర్గాల్లో పర్యటించడం, ప్రజలకు సాయం చేయడం.. కరోనా సమయంలో వలస కూలీలకు ఆహారం అందించడం, నగరంలో శాంతి భద్రతల విషయంలో పోలీసులను టార్గెట్ చేయడం, ఇటీవల జరిగిన రెండు ఘటనల (యువతులపై దాడి, పేమోన్మాదం) పై స్పందించడం.. వంటివి వారికి మంచి మార్కులు వేస్తున్నాయి. కానీ.. ఈ ముగ్గురి వ్యూహం మాత్రం కేవలం మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే కావడం గమనార్హం. అలా కాకుండా రాజకీయాల్లో రాణించాలనే లక్ష్యంతో ముందుకు సాగితే. ప్రజల్లో బలోపేతం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మరి వీరి ముందు సత్తా చాటి పదవులు ఆశిస్తారా ? పదవులే పరమార్థంగా రాజకీయం చేస్తారా ? అన్నది చూడాలి.