కొత్త వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ.. రైతుసంఘాలు చేపట్టిన ఆందోళన 34వ రోజు కొనసాగింది. ఎముకలు కొరికే చలిలోనూ.. అన్నదాతలు పట్టువీడటం లేదు. కొత్త చట్టాల్ని రద్దు చేయాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే రేపు కేంద్ర ప్రభుత్వం మరోసారి రైతు ప్రతినిధులతో చర్చలు జరపనుంది.

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం అంతకంతకూ ఉధృతమవుతోంది. 34 వ రోజు కూడా  సింఘు, టిక్రి, ఘాజిపూర్, చిల్లా సహా.. దేశరాజధానిలోని చుట్టుపక్కల ప్రాంతాలు ఆందోళనలతో మార్మోగాయి. గడ్డకట్టే చలిలోనూ పోరుబాట వీడని రైతులు.. కొత్త సాగు చట్టాల్ని రద్దుచేయాలన్న డిమాండ్‌ నుంచి వెనక్కి తగ్గడం లేదు.

హస్తిన వేదికగా రైతులు చేస్తున్న ఆందోళనకు.. దేశవ్యాప్తంగా మద్దతు అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అన్నదాతలకు అండగా.. తాజాగా, బిహార్‌ రైతులు కదం తొక్కారు. పలు రైతు సంఘాలతో కలిసి.. పట్నాలోని రాజభవన్‌కు ర్యాలీగా తరలివెళ్లారు. నూతన సాగు చట్టాలకు వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

బుధవారం కేంద్రం.. రైతు సంఘాలతో ఆరో దఫా చర్చలు జరపనున్నాయి. కేంద్రం ఇప్పటికే రైతు సంఘాలకు చర్చలకు ఆహ్వానించింది. కొత్త సాగు చట్టాలు సహా అన్ని అంశాలపై చర్చిస్తామని కేంద్రం తెలిపింది.  ఉద్యమిస్తున్న 40 రైతు సంఘాలను చర్చల నిమిత్తం ఆహ్వానించింది. 29న చర్చలు నిర్వహిద్దామని రైతు సంఘాలు లేఖరాయగా... 30న చర్చలు జరుపుదామని కేంద్రం బదులిచ్చింది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో చర్చలు జరగనున్నాయి.

మరోవైపు, సింఘు, టిక్రీ సరిహద్దుల నుంచి కుండ్లీ-మనేసార్‌-పల్వాల్‌ జాతీయ రహదారి వరకు ట్రాక్టర్ల ర్యాలీని కూడా రేపు నిర్వహిస్తున్నారు రైతులు. ఈ కార్యక్రమాన్ని గతంలోనే నిర్ణయించారు రైతులు. ప్రభుత్వంతో చర్చలు, రైతుల ట్రాక్టర్ల ర్యాలీ.. ఒకేరోజు జరగనున్నట్టు తెలుస్తోంది.

మొత్తానికి ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతల ఆందోళన రోజురోజుకూ తీవ్ర రూపం దాలుస్తోంది. తమ డిమాండ్లు ఒప్పుకునే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రైతులు తెగేసి చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: