తూర్పు లడక్‌లో టెన్షన్‌లు సద్దుమణగలేదు. సరిహద్దు వివాదానికి చెక్ పడలేదు. విడతల వారీగా చర్చలు జరిగినా.. ఓ కొలిక్కి రాలేదు. అటు రెండు దేశాలు బోర్డర్లో భారీగా బలగాలను మోహరించాయి. వెనక్కి తగ్గేది లేదంటున్నాయి. ముఖ్యంగా పాంగాంగ్ సరస్సుపై కన్నేసిన చైనా.. వెనక్కి తగ్గేందుకు ససేమిరా అంటోంది. సరిహద్దుల్లో డ్రాగన్ కుట్రలను తిప్పికొట్టేందుకు నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తోంది ఇండియన్ ఆర్మీ.
తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సుతో పాటు ఇతర నదీజలాలపై గస్తీని పెంచేందుకు అత్యాధునిక నిఘా పడవలను రంగంలోకి దించనుంది. ఈ మేరకు 12 నిఘా ఓడల కోసం ప్రభుత్వ రంగ సంస్థ గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌తో సైన్యం ఒప్పందం చేసుకుంది. పాంగాంగ్ సహా ఎత్తయిన పర్వత శ్రేణుల్లో ఉండే క్లిష్టమైన నదీ జల్లాల్లో గస్తీ కాయడం కోసం వీటిని కొనుగోలు చేస్తున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ అత్యాధునిక బోట్లు ఈ ఏడాది మే నుంచి అందుబాటులోకి రానున్నాయి. సైన్యం అవసరాలకు తగ్గట్లు ఈ ఓడల్లో ప్రత్యేక ఉపకరణాలను అమర్చనున్నట్లు గోవా షిప్‌యార్డ్ సంస్థ వెల్లడించింది.
దాదాపు 134 కిలోమీటర్ల పొడవున్న పాంగాంగ్ సరస్సు టిబెట్ వరకు విస్తరించింది. 60 శాతం సరస్సు టిబెట్ పరిధిలో ఉంటుంది. ఈ సరస్సు తమదేనని చైనా వాదిస్తోంది. భారత్ తమది చెబుతోంది. కొన్నేళ్ల క్రితం సరస్సులో భారత దళాలు గస్తీ నిర్వహిస్తుంటే చైనా దళాలు మరబోట్లు వేసుకొని వచ్చి అడ్డుకొన్నాయి. దీంతో భారత్ కూడా టాంపా రకం బోట్లను ఇక్కడ వినియోగించడం మొదలుపెట్టింది. ఇప్పుడు డ్రాగన్ ఎల్‌ఎక్స్ రకం బోట్లను తీసుకురావడంతో.. అత్యాధునిక నిఘా బోట్లను రంగంలోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది ఇండియన్ ఆర్మీ.