జాక్ మా సంస్థ అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ ను చైనా టార్గెట్ చేసిందా? ఈ ప్రశ్నకు సమాధానం అవుననే వినిపిస్తోంది. ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇవే ధోరణిలో ఉన్నాయి. అలీబాబా గ్రూప్ హోల్డింగ్, టెన్సెండ్, యాంట్ గ్రూప్లపై గుత్తాధిపత్యం ఆరోపణలతో చైనా ప్రభుత్వం దర్యాప్తును ప్రారంభించింది. ఇ-కామర్స్ నుండి లాజిస్టిక్స్, సోషల్ మీడియా వరకు విస్తరించి ఉన్న జాక్ మా యాంట్ గ్రూప్, అలీబాబా వ్యాపార సామ్రాజ్యంపై ప్రభుత్వం అణిచివేతకు డిసెంబర్ లోనే అడుగులేసింది. ఇంటర్నెట్ ప్రపంచంలో జాక్ మాకు పెరుగుతున్న ఆదరణ ప్రభావాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం చేస్తున్న కసరత్తులో భాగంగా జాక్ మాపై ఒత్తిడి పెంచినట్టు భావిస్తున్నారు. నవంబర్లో జారీ చేసిన ముసాయిదా గుత్తాధిపత్య వ్యతిరేక చట్టం ప్రకారం, జాక్ మా లాంటి పారిశ్రామికవేత్తల వ్యాపార సామ్రాజ్య ఆధిపత్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వానికి అపరిమిత హక్కు లభిస్తుంది.
వాస్తవానికి చైనా ఆర్ధిక శ్రేయస్సు, దాని సాంకేతిక బలానికి ప్రతిబింబంలాంటివి జాక్ మా కంపెనీలు. అలీబాబా, టెన్సెంట్ హోల్డింగ్ సంస్థలు కోట్ల మంది వినియోగదారుల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. దీన్ని అడ్డుకునేందుకే చైనా పాలకులు ప్రయత్నిస్తున్నాయి.
ఈ పరిణామాల మధ్య గత నెలలో యాంట్ సంస్థ ఐపిఒ పట్టాలు తప్పినప్పటి నుండి జాక్ మా బహిరంగ వేదికపై ఎక్కడా కనిపించలేదు. డిసెంబరు ఆరంభంలోనే జాక్ మాను దేశంలోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. సాంకేతిక సంస్థల ఆధిపత్యం దేశ రాజకీయ, ఆర్థిక స్థిరత్వానికి పెరుగుతున్న ముప్పుగా చైనా ప్రభుత్వం భావిస్తోందనే వాదనలున్నాయి.