హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పదవి ఎవరిని వరించనుందనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి దాదాపు పీసీసీ చీఫ్ పదవి ఖాయమైపోయిందని రెండు రోజుల క్రితం వార్తలొచ్చాయి. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటివరకు జీవన్ రెడ్డి పేరును ప్రకటించలేదు. అయితే త్వరలోనే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు ఉండటంతో.. ఆ ఎన్నిక తరువాతే ఈ నియామకం ఉంటుందంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాలు చూసుకుంటున్న మాణికం ఠాగూర్ చెప్పారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకమని, ప్రస్తుతం ఉన్న కమిటీతోనే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక బరిలోకి దిగుతామని ఆయన అన్నారు. 
 
ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసేసినప్పటికి ఈ ఉప ఎన్నిక ముగిసే వరకు ఆయనే పీసీసీ చీఫ్‌గా కొనసాగనున్నట్టు తెలిపారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పూర్తి అయిన వెంటనే పూర్తి స్థాయి కమిటీని ప్రకటిస్తామని మాణికం ఠాగూర్ చెప్పారు. పూర్తి స్థాయి కమిటీని ప్రకటించాక 2023 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు. కాగా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిన విషయం తెలిసిందే. తెలంగాణ ఇచ్చిన పార్టీగా అధికారంలోకి వస్తుందనుకుంటే అంతకంతకూ బలహీనపడుతోంది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది. 
 
దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఊహించిన విధంగా ఓట్లు రాలేదు. మరోపక్క రాష్ట్రంలో బీజేపీ చేప కింద నీరులా విస్తరిస్తూ పోతోంది. దుబ్బాకలో విజయం సాధించిన బీజేపీ జీహెచ్ఎంసీలోనూ గట్టి పోటీనిచ్చింది. టీఆర్ఎస్‌ పార్టీ మేజిక్ ఫిగర్‌కు చేరుకోకుండా అడ్డుకట్ట వేయగలిగింది. ఈ ఆనందంతోనే 2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఆ పార్టీ దూసుకుపోతోంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలోనూ విజయం బీజేపీదే అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ దీమా వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: