సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలుగు వారు తమ తమ ఊర్లకు చేరుకుంటున్నారు. ఏపీకి వచ్చే దారిలో టోల్ ప్లాజాలు మొత్తం ఇప్పటికే వాహనాలతో నిండిపోయాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే ఏపీలో సంక్రాంతికి కోడి పందాలు జరుగుతాయా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. నిజానికి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేకుండా సంక్రాంతి వచ్చిందంటే అందరూ కలిసి కోడి పందాళ్లో పాల్గొంటుంటారు. అయితే పోలీసులు ఇప్పటికే అనేక జిల్లాల్లో మూడు వారాల పాటు 114 సెక్షన్‌ను విధించారు. అయినప్పటికి అధికార పక్షం చివరి క్షణంలో చూసి చూడనట్టు వదిలేస్తుందని.. పండుగ మూడు రోజులు ఏ బాధ లేకుండా పందేలు యథేచ్చగా సాగుతాయని చర్చ నడుస్తోంది. సంక్రాంతి పండుగ వస్తుందంటేనే పందెం రాయుళ్లు మామూలుగా రెచ్చిపోరు. ఒక్క రోజులోనే కోట్లకు కోట్లు చేతులు మారుతుంటాయి. లక్షల నుంచి కోట్లలో పందేలు కాసే వారు కూడా ఉన్నారు.

కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే పోలీసులు మాత్రం ఇప్పటికే రంగంలోకి దిగిపోయారు. 114 సెక్షన్‌ను విధించారు. కానీ పందేం రాయుళ్లు మాత్రం తమకు ఇలాంటి సెక్షన్‌లు ప్రతి ఏడాది కామన్ అనేలా వ్యవహరిస్తున్నారు. నరసాపురం, భీమవరం, పాలకొల్లు, తణుకు, జంగారెడ్డిగూడెం, ఏలూరు  ప్రాంతాల్లో ఇప్పటికే హోటళ్లు, లాడ్జిలు ఫుల్లుగా బుక్ అయిపోయాయి. మరోపక్క కృష్ణా జిల్లాలో ఇప్పటికే పందేల శిబిరాలను కూడా ఏర్పాటు చేయడం మొదలు పెట్టేశారు. గన్నవరం నియోజకవర్గంలోని చిన్న ఆవుటపల్లి, మర్లపాలెం, కొండపావులూరు, గోపవరపుగూడెం, తదితర  గ్రామాల్లో కోడి పందేల శిబిరాల ఏర్పాటుకు రంగం సిద్ధమయి పోయింది. ఇక్కడే కాకుండా విజయవాడ రూరల్‌ మండలంలోని కొత్తూరు, తాడేపల్లిలోని మామిడి తోటల్లో భారీగా పందేల శిబిరాలను పందెం రాయుళ్లు ఏర్పాటు చేస్తున్నారు.

అధికార పార్టీకి చెందిన అనేక మంది ఇప్పటికే ప్రభుత్వ పెద్దల నుంచి అనుమతులను పొందేందుకు తమకు తోచిన ప్రయత్నాలను చేస్తున్నారు. ప్రభుత్వం కోడి పందేలు జరగకుండా అడ్డుకుంటే అధికార పార్టీకి చెందిన నాయకులే వ్యతిరేకించే ప్రమాదం లేకపోలేదు. అంతలా కోడి పందేలకు అలవాటు పడిపోయారు. అంతేకాకుండా కోడి పందేలు అడ్డుకుంటే ఆయా జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పెద్దలు కూడా పండుగ మూడు రోజులు కోడి పందేలకు పరోక్షంగా అనుమతులు ఇచ్చే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: