ఈ క్రమంలో పార్టీలో ఊపు తెచ్చేందుకు, దూకుడుగా ముందుకు సాగేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే బాగుంటుందనే భావన పార్టీ సీనియర్లలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే బాలయ్య అరంగేట్రంతో సీనియర్లు ఒకింత ఊపిరి పీల్చుకున్నారు. గతానికి భిన్నం గా ఆయన స్పందిస్తారని అనుకున్నారు. అదేసమయంలో పార్టీని కూడా ముందుకు నడిపించేందుకు ప్రయత్నిస్తారని అనుకున్నా రు. వారు అనుకున్నట్టుగానే బాలయ్య దూకుడు చూపించారు. రెండు రోజుల పాటు హిందూపురంలో పర్యటించారు. అంతేకాదు.. ప్రభుత్వంపై దూకుడుగా కామెంట్లు కుమ్మరించారు.
అవసరమైతే.. సీఎం జగన్‌ను సైతంతాను కలుస్తానని.. రైతుల సమస్యలపై చర్చిస్తానని చెప్పడం వరకు బాగానే ఉంది. అయితే.. పార్టీప రంగా బాలయ్య ఏం చేశారనేది కీలక ప్రశ్నగా మారింది. యూత్‌ను కదలించడంలో బాలయ్య దూకుడు సరిపోలేదు. పైగా అనంతపురంలోనే చాలా మంది యువ నాయకులు ఉన్నా.. బాలయ్య పర్యటనకు దూరంగా ఉండడం గమనార్హం. జేసీ కుటుంబం పూర్తిగా బాలయ్య పర్యటనకు దూరంగా ఉంది. అదేవిధం గా పరిటాల ఫ్యామిలీ కూడా అంటీముట్టనట్టు వ్యవహరించింది. ఈ నేపథ్యంలో బాలయ్య వచ్చాడు-వెళ్లాడు.. అనే కామెంట్లు వినిపిస్తుండడం గమనార్హం.
ఈ పరిణామాలతో పార్టీలో సీనియర్లు ఆశించినంత దూకుడు అయితే.. బాలయ్య తీసుకురాలేక పోయారనేది వాస్తవం. కానీ, కొంత ఉత్సాహమైతే.. వచ్చింది. అయితే అల్లుడు లోకేష్ కన్నా మామ బాలయ్యే పంచ్‌లు పేల్చాడన్నది కూడా పార్టీ వర్గాల టాక్ ? నందమూరి ఫ్యామిలీ ఇటీవల కాలంలో పార్టీకి చేరువ అయితే.. బాగుంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపథ్యంలో బాలయ్య రావడం, గుడివాడ ఎమ్మెల్యే కమ్ మంత్రి కొడాలి నానిపైనా వ్యాఖ్యలు చేయడం సర్వత్రా ఆసక్తిని రేపింది.