క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో త‌మ‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్న భూమా నాగిరెడ్డి కుటుంబం నుంచి వ‌చ్చిన వార‌సురాలిగా భూమా అఖిల ప్రియ త‌న‌దైన ముద్ర వేశారు. నిజానికి వార‌సులుగా వ‌చ్చిన వారిలో నిల‌దొక్కుకున్న వారు చాలా త‌క్కువ మంది. ఇక‌, మ‌హిళ‌లైతే.. నేటి రాజ‌కీయాల్లో నిల‌బ‌డ‌డం చాలా క‌ష్టం. అలాంటి ప‌రిస్థితిలో భూమా వార‌సురాలిగా అరంగేట్రం చేసిన అఖిల ప్రియ అటు.. ఆళ్ల‌గ‌డ్డ‌, ఇటు నంద్యాల నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ట్టు సాధించారు. అంతేకాదు.. నంద్యాల ఉప ఎన్నిక స‌మ‌యంలో ప‌ట్టుబ‌ట్టి.. త‌న సోద‌రుడు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. ఇటు పార్టీలోను, అటు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ త‌న‌దైన దూకుడుతో ముందుకు సాగారు.

అయితే.. ఇప్పుడు భూమా కుటుంబం నుంచి మ‌రో షార్ప్ షూట‌ర్ రంగంలొకి దిగుతున్నారు. ఆమే అఖిల ప్రియ సోద‌రి మౌనిక‌. గ‌తంలో 2017లో జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక స‌మ‌యంలో గ‌ట్టి వాయిస్ వినిపించిన మౌనిక‌.. గ‌త 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో దూకుడుగా ప్ర‌చారం చేశారు. త‌ర్వాత‌.. మ‌ళ్లీ మౌనం పాటించారు. అయితే.. ఇటీవ‌ల అఖిల ప్రియ‌ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన నేప‌థ్యంలో మ‌రోసారి మౌనిక‌.. తెర‌మీదికి వ‌చ్చారు. ఇటు రాజ‌కీయ నేత‌ల‌ను ప్ర‌శ్నిస్తూనే.. అటు.. పోలీసుల‌కు కూడా ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు.

‘‘ఎలాంటి సాక్ష్యాలు లేవు. ఆధారాలు లేవు. కానీ, మా అక్కను అరెస్టు చేశారు. ఉగ్రవాదిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. రోజుకో సెక్షన్‌ పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారు’’ అని భూమా మౌనిక ఆరోపించారు. మౌనిక మాట తీరు.. వాగ్ధాటిని గ‌మ‌నిస్తే.. సీనియ‌ర్ పొలిటీషియ‌న్ స్థాయిలో ఉన్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇక‌, ఇప్పుడు ఆమె త‌నంత‌ట త‌నే చేసిన కామెంట్ల‌ను బ‌ట్టి.. త్వ‌ర‌లోనే పూర్తిస్థాయిలో రాజ‌కీయ అరంగేట్రం చేసేందేకు మౌనిక రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది.

రాజకీయ ఒత్తిళ్లు భూమా కుటుంబానికి కొత్త కాదని, భూమా కుటుంబం నుంచి తాను బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. అంటే.. దీనిని బ‌ట్టి ఆమె పూర్తిస్థాయిలో పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌బో్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. మంచి చ‌దువు, చ‌క్క‌టి విశ్లేష‌ణ‌, అంత‌కు మించిన వాగ్ధాటి.. వంటివి ఉన్న యువ నాయ‌కురాలుగా రాజ‌కీయాల్లోకి వ‌స్తే.. మౌనికకు తిరుగు ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: