ఇప్పటి వరకూ నేషనల్ హైవేలపైనే టోల్ బాదుడు చూశాం. ఇకపై రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఆర్ అండ్ బి రోడ్డు ఎక్కినా కూడా పన్ను చెల్లించి ముందుకు కదలాల్సిందే. తొలి విడతగా రాష్ట్రంలో 9 రహదారులను టోల్ జాబితాలోకి చేర్చారు.
టోల్ జాబితాలో ఉన్న రహదారులివే..
ఏలూరు - జంగారెడ్డిగూడెం (51 కిలోమీటర్లు), భీమవరం - ముదినేపల్లి (50 కిలోమీటర్లు), కర్నూలు - దేవనకొండ (65 కిలోమీటర్లు), చిత్తూరు - పుత్తూరు (64 కిలోమీటర్లు), కడప - పులివెందుల (65 కిలోమీటర్లు), కడప - బద్వేల్ - పోరుమామిళ్ల - తాటిచెర్ల మొత్తంగా (126 కిలోమీటర్లు ), ఒంగోలు - బెస్తవారిపేట (108 కిలోమీటర్లు ), హనుమాన్ జంక్షన్ - విస్సన్నపేట (43 కిలోమీటర్లు ), గుంటూరు - చీరాల (49 కిలోమీటర్లు). ఈ జాబితాలో ఉన్నాయి.
రాష్ట్రంలో రహదారులపై పన్ను వసూలు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను కొన్నాళ్లుగా ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. రాష్ట్ర రహదారులపై పన్ను వేస్తే వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడతారని, ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. కానీ ప్రభుత్వం మాత్రం ముందడుగు వేయడానికే సిద్ధపడినట్టు తెలుస్తోంది. రాష్ట్ర రహదారులపై టోల్ బాదుడికి సంబంధించి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. ఏప్రిల్ 1నుంచి రెండేళ్లపాటు వసూలు చేయాలని నిర్ణయించారు. వాహనాల రద్దీ అధికంగా ఉండే 35 రాష్ట్ర రహదారుల్లో.. మొదటి విడతలో 9 మార్గాలను ఎంపిక చేశారు. ఈ రోడ్ల మరమ్మతులు, విస్తరణకు రూ.54 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ అనుమతి రాగానే.. టోల్ ప్లాజాల ఏర్పాటు, టోల్ వసూలుకు టెండర్లు పిలుస్తారని తెలిపారు.