స్నేహం... ఓ అద్భుత అనుబంధం.
అది అపూర్వం, అపురూపం, అద్వితీయం...
స్నేహం అంటే- ఓ విశ్వాసం... వికాసం...
అది ఓ మార్గదర్శి, ఓ మాధుర్యం...
నిట్టూర్పుల వేళ అది.. ఓ చక్కటి ఓదార్పు...
‘నేనున్నానంటూ’ ఆదుకునే ఆపన్న హస్తం - స్నేహం
సృష్టిలో ఏ జీవికి లేని రీతిలో మనిషికి ఓ వరం...
రక్త సంబంధం లేకున్నా
------------------------
అంతకంటే ఎక్కువగా పెనవేసుకునే అనుబంధం...
స్నేహితుడంటే - చుట్టరికం లేని ఆత్మీయ బంధువు, బెత్తం పట్టుకోని ఓ గురువు.. స్నేహం గురించి ఎంత చెప్పాలన్నా అక్షరాలు సరిపోవు, ఉపమానాలు సరితూగవు.... నిజమైన స్నేహితుడంటే - ప్రతి మజిలీలో చేయ పట్టుకుని నడిపించాలి, ప్రతి మలుపు దగ్గరా గండం గట్టెక్కించాలి. అయోమయం వేళ, అనిశ్చితి వేళ దిశా నిర్దేశం చేయాలి... సర్వం తానై ఆదుకోవాలి. ఆధునిక యుగంలో సమాచార విప్లవం అనూహ్యంగా విస్తరించడంతో స్నేహాలు పెరిగాయి... స్నేహితులూ పెరుగుతున్నారు. కుల మతాలు, భాష, ప్రాంతాలు అనే సరిహద్దులను చెరిపేస్తూ స్నేహబంధం కొత్త పుంతలు తొక్కుతోంది. ‘ఇంటర్నెట్’ వినియోగం ఇళ్లల్లో సైతం పెరగడంతో ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మీడియాలో, సెల్ ఫోన్లలో స్నేహ బంధాలు వెల్లివిరుస్తున్నాయి. నేటి నవ నాగరిక రోజుల్లో బంధుత్వాలకు కొందరు దూరం కావచ్చు... కానీ, స్నేహితులు లేని వారు నిజానికి ఎవరూ ఉండరు.
నిర్లక్ష్యం చేయొద్దు..
-------------------
పట్టణీకరణ అనూహ్యంగా పెరిగిపోవడం, మన చుట్టూ సమాజ వాతావరణం ‘కాంక్రీట్ జంగిల్’ను తలపిస్తుండటంతో నేడు స్నేహబంధాన్ని పదిలంగా కాపాడుకోవడం పెద్ద సమస్యే... ఉరుకులు, పరుగుల నేటి యాంత్రిక జీవనంలో కాసింత తీరుబడి చేసుకునైనా స్నేహానికి ప్రాధాన్యత ఇవ్వాలి. స్నేహబంధాలు దూరమై పోతున్నాయన్న ఒత్తిడి కొందరిలో పెరిగిపోతోంది. ఎవరి పనుల్లో వారు బిజీ కావడం వల్ల ఆప్తమిత్రులు సైతం కలుసుకోలేని పరిస్థితులు నేడు నెలకొంటున్నాయి. చుట్టూ ఎందరో ఉన్నా ఒంటరితనంతో బాధపడేవారు పట్టణాల్లో, నగరాల్లో ఎందరో కనిపిస్తుంటారు. స్నేహం అనేది వ్యక్తిగతమైనా- ఇదొక సామాజిక అవసరం. దీని కోసం కొద్ది సమయమైనా వెచ్చించడం అలవాటు చేసుకుంటే మానసిక వత్తిడులు దూరమవుతాయి. దూరంగా ఉంటూ ప్రత్యక్షంగా కలుసుకోవడానికి వీలు లేకుంటే- ఫోన్ ద్వారానో, ఈ- మెయిల్ ద్వారానో స్నేహితులను ఆత్మీయంగా పలకరించవచ్చు. మనం చేసే పని మంచైనా, చెడైనా నిర్మొహమాటంగా చెప్పినపుడే స్నేహం కలకాలం శాశ్వతంగా నిలుస్తుంది. స్నేహితులు చేసే విమర్శలను సహృదయతతో స్వీకరించాలి; పొగడల్తో అయినా, విమర్శలోనైనా నిజాయితీ ప్రతిఫలించాలి. అనవసర విషయాలకు అపార్థం చేసుకుంటే స్నేహితులు దూరమవుతారు. ఈ పరిస్థితి నేడు నగరాల్లో ఎక్కువగా కన్పిస్తోంది.
బంధాలు ఇలా మొదలు..
---------------------------
కొన్ని సందర్భాల్లో పరస్పర ప్రయోజనాలు, ఆర్థిక వ్యవహారాలతో కొందరిలో స్నేహ బంధం తొలుత చిగురిస్తుంది. ఇలాంటి బంధాలు పదిలం కావాలంటే తగు జాగ్రత్తలు అవసరం. ఆర్థిక ప్రయోజనం ఆశించే స్నేహాలు తొందరలోనే ముగుస్తాయి. ఇలాంటి విషయాల్లో స్నేహం కొనసాగించేందుకు ఆచితూచి వ్యవహరించడం అవసరం. ఇంకొన్ని సందర్భాల్లో మనోభావాలను పంచుకునేందుకు, మానసిక సాంత్వన కోసం స్నేహాలు చిగురిస్తాయి. భావాలను గౌరవించుకోవడంతో మొదలయ్యే స్నేహబంధం అన్ని అడ్డంకులనూ అధిగమిస్తే పరిపక్వ దశకు చేరుకుంటుంది. కేవలం సానుభూతి పొందడానికో, సహాయం పొందడానికో కాదు. నిజాయితీతో, నిండు మనసుతో స్నేహం చేయాలి. అపోహలు, అనుమానాలు, వ్యక్తిగత స్వార్థం వంటివి జయించిన స్నేహం పరిపూర్ణతను సంతరించుకుంటుంది. ఇదే శాశ్వత బంధంగా నిలుస్తుంది. ఎదురెదురుగా లేకున్నా ఈ స్నేహం కలకాలం ఉంటుంది.
కౌమార, యవ్వన దశల్లో యువతీ యువకులు స్నేహ బంధాలపైన మోజు పడటం సర్వసాధారణం. తెలిసీ తెలియని వయసులో స్నేహం పేరిట వీరు పెడతోవ పట్టకుండా తల్లిదండ్రులే చొరవ చూపాలి. స్నేహం విషయంలో పిల్లలకు పెద్దలే ఆదర్శవంతంగా, స్ఫూర్తిదాయకంగా నిలవాలి. చిన్న వయసు నుంచీ స్నేహితులతో కలసిమెలసి ఉండేలా తమ పిల్లలను నేడు చాలామంది తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. అయితే ఈ స్నేహాలు సమయాన్ని వృథా చేయడానికి కాకుండా -చదువులో రాణించేందుకు, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడాలి. ఇందుకు పేరెంట్స్ మార్గదర్శకులు కావాలి. పిల్లలు, వారి స్నేహితులు చదువులోగానీ, క్రీడల్లో గానీ రాణిస్తే వారిని తప్పక మెచ్చుకోవాలి. ఇలాంటి ప్రోత్సాహం స్నేహబంధాన్ని మరింత బలపరుస్తుంది. ఏ వయసు వారికైనా స్నేహబంధం పదిలంగా ఉండాలంటే పరస్పరం విశ్వాసం, నిజాయితీ ఉండాలి. స్వార్థ ప్రయోజనాలు, ఏవో అవసరాలు ఉండకూడదు. ఆపద సమయాల్లో ఆదుకోవాలి, ఆత్మీయ పలకరింపులతో ధైర్యం చెప్పాలి. నిజాయతీగా సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలి. హాస్యచతురత వెల్లివిరియాలి. ఓపిక, సహనం, జాలి, కరుణ వంటివి ఉండాలి.
ఆరోగ్యానికి దివ్యౌషధం..
-------------------------
ఆర్థిక బాధలు, మానసిక ఒత్తిళ్లు, నిద్రలేమి, అలసట, అనారోగ్యం వంటి సమయాల్లో మనసు సేద తీరేందుకు స్నేహబంధం ‘ఎడారిలో ఒయాసిస్సు’లా కనిపిస్తుంది. బాధలను, సమస్యలను ఆత్మీయ మిత్రులతో చెప్పుకుంటే మనసు కొంత తేలికపడుతుంది. మానసిక సమస్యలు తొలగినపుడు శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనపుడు స్నేహితులను ఆశ్రయిస్తే ఎంతోకొంత ఊరట లభిస్తుంది. జీవన మాధుర్యాన్ని చవిచూడాలంటే స్నేహబంధం అవసరం. కాలక్షేపం కోసం కాకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకుని, భావికి బాటలు వేసుకోవాలంటే స్నేహబంధాలు ఎప్పటికీ అవసరమే.
మరింత సమాచారం తెలుసుకోండి: