తెలంగాణలో ఫిబ్రవరి 1నుంచి పాఠశాలలు తెరిచేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో కరోనా వల్ల చాలామంది వలస జీవుల అడ్రస్ లు గల్లంతయ్యాయి. వారంతా పిల్లల చదువులకోసం కచ్చితంగా స్కూళ్లు మార్చాల్సిన పరిస్థితి. అప్పటి వరకు ప్రైవేట్ స్కూళ్లలో చదువు చెప్పిస్తున్నా.. కరోనా కష్టకాలంలో ఆదాయాలు తగ్గడంతో, పిల్లల చదువులకు వేలకు వేలు చెల్లించలేక ప్రభుత్వ స్కూళ్లను ఆశ్రయిస్తున్నారు చాలామంది. అయితే టీసీల విషయంలో ప్రైవేట్ యాజమాన్యాలు మెలిక పెట్టడంతో వీరంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కరోనా కాలంలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఆన్ లైన్ బాట పట్టాయి. పిల్లలు పాఠాలు విన్నా, వినకున్నా ఫీజులు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేసి మరీ వసూళ్లకు దిగాయి. అయితే చాలామంది తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేదు. ఏడాది తర్వాత స్కూల్ మార్చితే సరిపోతుంది కదా అనే ధైర్యంతో ఉన్నారు. అలాంటి వారందరినీ టీసీ పేరుతో ఇబ్బంది పెడుతున్నాయి యాజమాన్యాలు. ఆన్ లైన్ క్లాసులు వినకపోయినా, ఇప్పటికిప్పుడు స్కూల్ మారాలంటే మాత్రం కచ్చితంగా టీసీ తీసుకోవాల్సిందేనని మెలిక పెడుతున్నాయి. దీంతో చాలామంది తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

టీసీ తప్పనిసరి..
విద్యార్థుల పూర్తి వివరాలను ఆధార్‌ సంఖ్యతో అనుసంధానం చేసి.. పాఠశాల విద్యాశాఖలోని సమగ్ర శిక్షా అభియాన్‌ విభాగం, చైల్డ్‌ ఇన్ఫో పేరిట ఆన్‌ లైన్‌ లో నమోదు చేస్తోంది. దీంతో ఒక విద్యార్థి పేరు ఒక పాఠశాలలో మాత్రమే నమోదవుతుంది. బడి మారినప్పుడు పాత పాఠశాలలో పేరు తొలగించకపోతే, కొత్తగా చేరిన పాఠశాలలో అది నమోదు కాదు. ఈ సమస్యే ఇప్పుడు ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రుల మధ్య వివాదాలకు దారితీస్తోంది. విద్యా హక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకు టీసీలు లేకున్నా పాఠశాలలు విద్యార్థులను చేర్చుకోవాల్సిందే. తిప్పి పంపించడానికి వీలు లేదు. చేర్చుకున్న అనంతరం ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, గతంలో ఆ విద్యార్థి చదివిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి లేఖ రాసి టీసీ తెప్పించుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లేఖ తీసుకొని ఎంఈఓకు సమాచారం ఇచ్చి పాత బడిలో పేరు తొలగించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా స్కూల్స్ పూర్తి స్థాయిలో తెరిస్తే ఇలాంటి సమస్యలు మరిన్ని తలెత్తుతాయని విద్యాశాఖ అధికారులు తలలుపట్టుకున్నారు. టీసీల విషయంలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు ప్రభుత్వం తరపున గట్టి సూచన వెళ్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం లభించదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: