పరిటాల ఫ్యామిలీ... అనంతపురం జిల్లాలో రాజకీయంగా ఎక్కువ క్రేజ్ ఉన్న కుటుంబం.  పరిటాల రవీంద్ర టీడీపీలో ఓ పవర్ సెంటర్‌గా ఉండేవారు. అయితే రవి చనిపోయాక ఆయన భార్య సునీత టీడీపీలో కీలకంగా పనిచేశారు. మూడుసార్లు రాప్తాడు నుంచి గెలిచారు. అలాగే 2014-2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇక 2019 ఎన్నిలకొచ్చేసరికి సునీత పోటీ నుంచి తప్పుకుని, తన తనయుడు పరిటాల శ్రీరామ్‌ని రాప్తాడు బరిలో నిలిపారు.

జగన్ వేవ్‌లో శ్రీరామ్ ఘోరంగా ఓడిపోయారు. ఓడిపోయాక రాప్తాడు బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే మధ్యలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలోకి వెళ్లడంతో చంద్రబాబు, ధర్మవరం బాధ్యతలు కూడా పరిటాల ఫ్యామిలీకే అప్పగించారు. దీంతో పరిటాల కుటుంబం రాప్తాడు, ధర్మవరం బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇక ఇప్పుడు స్థానిక ఎన్నికల పోరు మొదలైంది. అందులో భాగంగా పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా వచ్చింది.

దీంతో రెండు నియోజకవర్గాల్లో పరిటాల ఫ్యామిలీ సత్తా చాటాలని చూస్తోంది. రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి మెజారిటీ సీట్లు వచ్చేలా చూడాలని అనుకుంటున్నారు. అటు టీడీపీ కేడర్ కూడా దూకుడుగానే పనిచేస్తోంది. అయితే అధికారంలో ఉన్న వైసీపీకి చెక్ పెట్టడం సులువైన పని కాదు. రెండుచోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు బలంగా ఉన్నారు. రాప్తాడులో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి ఉన్నారు.

ఇక వీరిలో కేతిరెడ్డి బాగా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఈయన ప్రతిరోజూ నియోజకవర్గంలో పర్యటిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో కేతిరెడ్డి క్రేజ్ బాగా పెరిగింది. రాప్తాడులో అయినా పరిటాల ఫ్యామిలీ టీడీపీకి మంచిగానే సీట్లు గెలిచేలా చేయగలరు గానీ, ధర్మవరంలో చాలా కష్టం. ఇక్కడ కేతిరెడ్డితో చాలా ఇబ్బంది. కేతిరెడ్డి ఉండగా పరిటాల ఫ్యామిలీ సత్తా చాటలేదు. కాబట్టి ధర్మవరంలో పరిటాల ఫ్యామిలీ సైడ్ అయిపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: