అధికార ప‌క్షం వైసీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఏ ఇద్ద‌రు కీల‌క నేత‌లు ఫోన్లు చేసుకున్నా.. ``మ‌నం కానీ ఇరుక్కుంటున్నామా ?`` అని నాయ‌కులు చ‌ర్చించుకుంటుండ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి ఒక‌రు.. ఎన్నిక‌ల క‌మిష‌న్‌పై తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. ఎన్నిక‌లు నిర్వ ‌హించాలా ? వ‌ద్దా.. అనే విష‌యంలో నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్‌.. కోర్టుకు వెళ్లారు. విచార‌ణ సంద‌ర్భంలో ఎన్నిక‌ల క‌మిష‌న్‌పై కొంద‌రు ప‌రుషంగా వ్యాఖ్యానిస్తున్నారంటూ.. న్యాయ‌వాది.. కోర్టు దృష్టి కి తెచ్చారు. దీంతో విష‌యం.. ఒక్క‌సారిగా హీటెక్కింది.

ఎవ‌రైనా.. ప‌రుషంగా మాట్లాడితే.. ఇక‌పై పిటిష‌న్ దాఖ‌లు చేయాల‌ని కోర్టు సూచించింది. బ‌హుశ‌.. ఈ కారణంగానే అయి ఉంటుంది.. తాజాగా మీడియాతో మాట్లాడిన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌.. నిమ్మ‌గ‌డ్డ‌.. త‌న‌పై వ్య‌క్తి గ‌త విమ‌ర్శ‌లు చేసేవారికి హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఇక‌పై ఎవ‌రూ హ‌ద్దులు దాటొద్ద‌ని ఆయ‌న సూచించారు. అంతేకాదు.. చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని కూడా చెప్పారు. దీంతో ఈ విష‌యం.. వైసీపీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌నీయాంశం అయింది. కీల‌క‌మైన మంత్రుల మ‌ధ్య‌.. విజ‌య‌వాడ నేత‌ల మ‌ధ్య కూడా ఇదే విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

``మ‌న నాయ‌కుడికి దూకుడు ఎక్కువ‌. ఆయ‌న‌ను కాపాడాల‌నేది మ‌న ప్ర‌య‌త్నం. ఈ క్ర‌మంలో మ‌న పీక‌లు తెగేలా ఉన్నాయే!!`` అని నాయ‌కులు చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ దూకుడును మొన్న‌టి వ‌ర‌కు స‌మ‌ర్ధించిన స‌ద‌రు మంత్రి ఇప్పుడు .. ఏదేమైనా.. మ‌న‌కు కూడా కొన్ని హ‌ద్దులు ఉంటాయి! అని అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఏం జ‌రిగినా.. సీఎం జ‌గ‌న్‌ను ఏమ‌న్నా.. వెంట‌నే రియాక్ట్ అయిన‌.. స‌ద‌రు మంత్రి వ‌ర్యులు.. ఇప్పుడు మాత్రం ఇలా వ్యాఖ్యానించ‌డం వెనుక‌.. అంత‌రార్థం ఏంట‌నేది ఆస‌క్తిగా మారింది. ఆ మాట‌కు వ‌స్తే రాజ‌ధాని జిల్లాకే చెందిన మ‌రో మంత్రి నిన్న మొన్న‌టి వ‌ర‌కు బ‌ల‌మైన వాయిస్ వినిపిస్తూ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మొత్తానికి ఎన్నిక‌ల‌పై సుప్రీం ఇచ్చిన షాక్‌తో మంత్రుల గ‌ళం మారుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: