కరోనా తర్వాత పాఠశాలల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం, తెలంగాణకంటే బాగా ముందుంది. ఏపీలో స్కూల్స్ యథావిధిగా సాగిపోతున్నాయి, సోమవారం నుంచి ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీలు కూడా తెరుచుకున్నాయి. దాదాపుగా 9, 10 తరగతుల విద్యార్థుల హాజరు శాతం నూటికి 95శాతం పైగానే నమోదవుతోంది. అదే సమయంలో అటు తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ అన్ని స్కూల్స్ సోమవారం మొదలయ్యాయి. అయితే హాజరు మాత్రం చాలా దారుణంగా పడిపోయింది.

కరోనా భయం తగ్గాక జనాలు రోడ్లపైకి రావడానికి, సినిమాలకు వెళ్లడానికి, షాపింగ్ లు, రెస్టారెంట్ లకు వెళ్లడానికి బాగానే ఇష్టపడుతున్నారు కానీ, స్కూల్స్ కి పిల్లల్ని పంపించడంలో మాత్రం ఎందుకో ఆలోచిస్తున్నారు. తెలంగాణలో తొలిరోజు స్కూల్స్ మొదలైనా 9వ తరగతి విద్యార్థుల్లో హాజరు శాతం కేవలం 41గా తేలింది. పదోతరగతి పిల్లల హాజరు శాతం కేవలం 54శాతం మాత్రమే. అదే సమయంలో ప్రైవేట్ స్కూల్స్ లో హాజరు ఎక్కువగా ఉందని చెబుతున్నారు అధికారులు.

ఇక కాలేజీలతో పోల్చి చూస్తే స్కూల్స్ లోనే ఎక్కువ హాజరు శాతం నమోదయింది. ప్రభుత్వ స్కూల్స్ లో మొత్తం 4,44,994 మందికి 1,89,185 మంది తరగతులకు వచ్చారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మొదటిరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకే తరగతులు జరిగాయి. మొత్తం 402 కళాశాలల్లో 85,255 మందికి 27,963 మంది మాత్రమే హాజరయ్యారు. అంటే హాజరు శాతం కేవలం 33 మాత్రమే. కొన్నిచోట్ల ఉపాధ్యాయులు విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. మరికొన్ని చోట్ల స్కూళ్లకు తోరణాలు కట్టి పండగ వాతావరణం నెలకొనేలా చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు నిధులివ్వకపోవడంతో ఎక్కడా థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయలేదు. శానిటైజర్లకు నిధులు లేకపోవడంతో పలుచోట్ల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు సొంత డబ్బులతో వాటిని కొనుగోలు చేసి పిల్లలకు అందించారు. కొనుగోలు చేశారు.

ఇక కేజీవీబీలు, గురుకులాల్లో హాజరు మరీ దారుణంగా పడిపోయింది. సంగారెడ్డి జిల్లా ఆందోలు సాంఘిక సంక్షేమశాఖ గురుకులంలో 324 మంది విద్యార్థులు ఉండగా అందులో కేవలం ఐదుగురు మాత్రమే హాజరయ్యారు. పిల్లల్ని గురుకుల హాస్టల్స్ లో ఉంచేందుకు తల్లిదండ్రులు ఎక్కువగా ఇష్టపడకపోవడంతో.. ఇలాంటి పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: