బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి అఖిల ప్రియ భర్త భార్గవ్‌రామ్‌ కొన్నాళ్లుగా పరారీలోనే ఉన్నాడు.. కేసు నమోదై నెల గడుస్తున్నా.. ఇప్పటి వరకూ పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు. ఇదే సమయంలో బెయిల్ కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. మొదట్లో బెయిల్ కోసం సికింద్రాబాద్ కోర్టులో ప్రయత్నించారు. ఎంత వేడుకున్నా సికింద్రాబాద్ కోర్టు బెయిల్ ఇవ్వలేదు.

దీంతో ఇక చివరి ప్రయత్నంగా భార్గవ్‌ రామ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కోర్టులో ఆయన తరపు న్యాయవాది వినిపిస్తున్న వాదన చూసి అంతా షాకయ్యారు. అసలు ఈ కిడ్నాప్‌ కేసుతో తనకు ఏమాత్రం సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాది వాదించారట. అధికార పార్టీ అండతో ఏవీ సుబ్బారెడ్డి తనపై తప్పుడు కేసులు పెట్టించారని భార్గవ్‌ రామ్‌ తరపు న్యాయవాది వాదించాడట. మొదట ఈ కేసులో సుబ్బారెడ్డిని ఏ వన్ గా సుబ్బారెడ్డిని ఉంచారని.. ఆ తర్వాత .. అతన్ని ఏ టూ గా మార్చారని భార్గవ్‌ రామ్‌ తరపు న్యాయవాది చెప్పారట.

తనకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేనందువల్ల తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును కోరాడట. మరోవైపు భార్గవ్‌ రామ్‌, జగద్విఖ్యాత్ రెడ్డి బెయిల్ వస్తే  తప్ప అజ్ఞాతం వీడే ఆలోచనలో ఉన్నట్టు కనిపించడంలేదు. వారిద్దరి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఈ కేసులో అఖిల ప్రియ తమ్ముడు జగద్విఖ్యాత్‌ రెడ్డి కూడా  చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఇక అఖిల ప్రియ విషయానికి వస్తే.. ఆమె ఇటీవల విడుదలైనా.. భర్త, తమ్ముడు ఇద్దరూ అజ్ఞాతంలో ఉండటంతో ఆమెకూ ఇబ్బందికరంగానే ఉంది.

మరోవైపు అఖిల ప్రియ నుంచి ఈ కేసు గురించి మరింత సమాచారం లాగే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఆమె ప్రతి 15 రోజులకు ఒకసారి ఆమె పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం పెట్టాలన్న నిబంధన విధించింది కోర్టు.. ఆ షరతు ప్రకారమే.. అఖిలప్రియ మొన్న బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఆ సమయంలోనూ అఖిల ప్రియను భర్త భార్గవ్ రామ్ గురించి ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: