తెలుగుదేశం పార్టీకి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఓ కంచుకోట‌. ఈ కంచుకోట‌లో చింత‌ల‌పూడి కూడా ఓ కంచుకోట‌. ఇక్కడ కాంగ్రెస్ ఉండ‌గా టీడీపీ 2004, 2009 ఎన్నిక‌ల్లో అది కూడా 1500 లోపు ఓట్ల తేడాతో మాత్ర‌మే ఓడిపోయింది. గ‌త ఎన్నిక‌ల్లో మాత్రం వైసీపీ విజ‌యం సాధించింది. చింత‌ల‌పూడిలో గ‌తంలో దివంగ‌త మాజీ మంత్రి కోట‌గిరి విద్యాధ‌ర‌రావు మంత్రిగా ఉన్న‌ప్పుడు వ‌న్ మ్యాన్ షో న‌డిచేది. ఎప్పుడు అయితే ఇది ఎస్సీల‌కు రిజ‌ర్వ్ అయ్యిందో చింత‌ల‌పూడి టీడీపీ రాజ‌కీయం అంతా గంద‌ర‌గోళంగా మారిపోయింది. పార్టీ నుంచి ఎవ‌రు అయినా పోటీ చేస్తే వాళ్ల‌ను రాజ‌కీయం చేయ‌నివ్వ‌రు. ముఖ్యంగా చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీలో క‌మ్మ వ‌ర్గం హ‌వా ఎక్కువ‌. నియోజ‌క‌వ‌ర్గ కేంద్ర‌మైన చింత‌లపూడిలో మాత్రం పార్టీలో ఎప్ప‌టి నుంచో ఉన్న ఓ రెడ్డి నేత ఆధిప‌త్యం ఉంటుంది.

వీరంతా క‌లిసి పార్టీని ముందుకు వెళ్ల‌నివ్వ‌రు.. పార్టీ అధికారంలో ఉంటే వాళ్లే రాజ‌కీయం చేయాలి.. మంత్రి అయినా.. ఎమ్మెల్యే అయినా వీరి చెప్పు చేత‌ల్లోనే ఉండాలి... వీళ్లే నియోజ‌క‌వ‌ర్గానికి ఎమ్మెల్యేలుగా ఫీలైపోతూ ఉంటారు. అన్ని ప‌ద‌వులు క‌మ్మ‌ల‌కే ఇవ్వాలి... ఎంపీపీలు, జ‌డ్పీటీసీలు, ఏఎంసీ చైర్మ‌న్లు, సొసైటీ అధ్య‌క్షులు, నీటి సంఘాల ప్రెసిడెంట్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక‌టేమిటి అన్ని వీరికే క‌ట్ట‌బెట్టాలి... వీరిని కాదంటే వీళ్ల వేషాలు మాత్రం చూడ‌లేం. ఆ మాట‌కు వ‌స్తే సీఎంను మించి ఫీలైపోతుంటారు.. వీరిలో ఒక‌రిద్ద‌రిని మిన‌హాయించినా అంద‌రూ నేత‌ల‌ది ఇదే ప‌రిస్థితి.

పార్టీ అధికారంలో ఉండ‌గా ప‌ద‌వులు మాకు కావాలంటే మాకు కావాల‌ని నానా ర‌చ్చ చేస్తూ ఐదేళ్ల నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధికి అడుగడుగునా అడ్డంపడ్డ ఈ పేద్ద నేత‌లంతా ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉంటే ఇంట్లో నుంచి ఏ ఒక్క‌రు బ‌య‌ట‌కు రాని ప‌రిస్థితి. మ‌రి కొంద‌రు నేత‌లు అయితే మాకు ప‌ద‌వులు లేవుగా... మేం ఎందుకు బ‌య‌ట‌కు రావాల‌ని ఇంట్లో కూర్చొని భీష్మించుకుంటున్నారు. చింత‌ల‌పూడి టీడీపీని యాక్టివ్ చేసేందుకు ఏలూరు పార్ల‌మెంట‌రీ జిల్లా పార్టీ అధ్య‌క్షులు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గ‌న్ని వీరాంజ‌నేయుల‌తో పాటు నియోజ‌వ‌ర్గ పార్టీ ప‌రిశీల‌కులు కొఠారు దొర‌బాబు త‌మ వంతుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నా వెన‌కాల చేతులు పెట్టుకుని పెత్త‌నం చేసే నేత‌లు మాత్రం త‌మ‌కేం ప‌ట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ప‌లు మండ‌లాల్లో పార్టీ కార్య‌క్ర‌మాల‌కు పిలుపు ఇస్తే బ‌య‌ట‌కు రాని నేత‌లు ఇప్పుడు పార్టీ క‌ష్టాల్లో ఉంటే స్థానిక ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు గాని... రూపాయి ఖ‌ర్చు చేసేందుకు కూడా ముందుకు రావ‌ట్లేదు. దీనిపై పార్టీ ప‌రిశీల‌కులు సైతం ప‌దే ప‌దే స‌ర్ది చెప్పేందుకు ప్ర‌య‌త్నించి ఈ విష‌యాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకు వెళుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు కొంద‌రు జిల్లా స్థాయి నేత‌ల‌ను చూసి ఎగిరినోళ్లు కూడా ఇప్పుడు కిక్కురుమ‌న‌డం లేదు. ఇక ప‌ద‌వులు లేవ‌ని.. ప్ర‌యార్టీ ఇవ్వ‌డం లేద‌ని ఎగిరినోళ్ల‌కు పై నుంచి చీవాట్లు రావ‌డంతో సైలెంట్ అయ్యారు. ఇక ఈ టైంలో బ‌య‌ట‌కు వ‌చ్చిన వారి పార్టీ కోసం క‌ష్ట‌ప‌డుతోన్న వారిని సైతం నానా ఇబ్బందులు పెట్ట‌డం కొస‌మెరుపు.

ఏదేమైనా పార్టీ క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడే బ‌య‌ట‌కు వ‌చ్చినోడు నిజ‌మైన పార్టీ అభిమాని.. కార్య‌క‌ర్త అవుతాడు... ప‌ద‌వులు ఉన్న‌ప్పుడు అధికారం ఎంజాయ్ చేసి ఇప్పుడు పార్టీని వ‌దిలించుకోవాల‌ని చూస్తోన్న ఈ నేత‌ల తీరు మారితేనే చింత‌ల‌పూడిలో టీడీపీకి భ‌విష్య‌త్తు ఉంటుంద‌న్న వాస్త‌వం ఈ నేత‌లు ఎప్ప‌ట‌కి తెలుసుకుంటారో ?

మరింత సమాచారం తెలుసుకోండి: