అధికారంలో ఉన్న జగన్‌ని తక్కువగా విమర్శిస్తూ సోము, బాబునే ఎక్కువగా టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వచ్చినా....జగన్ పేరు తీయకుండా మాట్లాడతారు. అదే సమయంలో గతంలో చంద్రబాబు ప్రభుత్వం తప్పు చేసిందని మాట్లాడతారు. అసలు సోము వీర్రాజు ఏ మీడియా సమావేశం చూసిన దాదాపు ఇలాగే ఉంటుంది.
అందుకే టీడీపీ నేతలు సైతం సోము వీర్రాజుపై ఫైర్ అవుతున్నారు. జగన్‌ని తమలపాకుతో కొడుతూ, చంద్రబాబుని తలుపు చెక్కతో కొడుతున్నారంటూ మండిపడుతున్నారు. ఇక టీడీపీ నేతల మాటలకు తగ్గట్టుగానే సోము వీర్రాజు రాజకీయం ఉంటుంది. ఎప్పుడు బాబునే టార్గెట్ చేసి సోము ముందుకెళ్తారు. తాజాగా కూడా సోము మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వాన్ని విమర్శించకుండా మాట్లాడారు.
రాష్ట్రంలో పెట్రోల్ ధరలు ఎలా మండుతున్నాయో అందరికీ తెలిసిందే. దీనిపై సోము మాట్లాడుతూ.. పెట్రోలు ధరలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని, దేశంలోని అన్ని ఫ్యాక్టరీల పైన విధానపరమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కేంద్రంతో రాష్ట్రాలకు అవగాహన లేకపోవడంతోనే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని, పెట్రోల్‌పై విధించే సెస్‌ను రాష్ట్రాలు తగ్గించుకోవాలని సూచించారు. పక్కనున్న తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాలు సెస్‌ను తగ్గించాయని, ఆ దిశగా అన్ని రాష్ట్రాలు ఆలోచించాలని సోము మాట్లాడారు.
అయితే ఇక్కడ ఏపీలో పెట్రోల్ రేట్లు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో సోము, జగన్ ప్రభుత్వాన్ని ఒక్క మాట అనకుండా, రాష్ట్రాలు సెస్ తగ్గించుకోవాలని ఏదో జాతీయ నాయకుడు మాదిరిగా మాట్లాడారు. మొత్తానికైతే సోము, జగన్ విషయంలో తమలపాకు రాజకీయం ఫాలో అవుతున్నట్లే కనిపిస్తోంది.