అటు తెలంగాణలోను, ఇటు ఏపీలోను అధికార పార్టీకి దన్నుగా ఉన్న సాక్షి.. ఆది నుంచి వైఎస్ కుటుంబంలో ఏం జరిగినా.. సింపతీ కోసం.. అన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లిన చరిత్ర ఉంది. ఇదే సాక్షి.. గతంలో షర్మిల పాదయాత్ర చేసినట్టు గంటల కొద్దీ లైవ్‌లు ఇచ్చింది. ఆమెకు అనుకూలంగా కథనాలు, డిబేట్లు కూడా నిర్వహించింది. జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్రకు సాక్షి మీడియా ఇచ్చిన కవరేజ్ అంతా ఇంతా కాదు. ఇక, ఏపీలో గత ఎన్నికల్లో షర్మిల అన్నకోసం ప్రచారం చేసినప్పుడు కూడా సాక్షి టీవీ, పత్రికలు రెండు భారీ ఎత్తున ఫోకస్ చేశాయి. అలాంటి మీడియా ఒక్కసారిగా మూగబోయింది. షర్మిల పార్టీ ఏర్పాట్లు, సన్నాహక సమావేశాలపై ఎక్కడా కిక్కురుమనకపోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలో తమకంటూ ప్రత్యేక మీడియా డయాస్ ఉండాలని భావిస్తున్న షర్మిల ఆమె భర్త సువార్తికుడు అనిల్ కుమార్‌లు ప్రత్యేకంగా టీవీ చానెల్‌ను ఏర్పాటు చేసుకుంటున్న విషయం తెరమీదికి వచ్చింది. దాదాపు నెల రోజులుగా బెంగళూరు వేదికగా.. టీవీ ఏర్పా ట్లకు సంబందించినచర్చలు సాగుతున్నాయని అంటున్నారు. టీవీ 9 మాజీ సీఈవో కీలక పాత్ర పోషిస్తున్నారని తాజాగా వెలుగు చూసింది.
అత్యంత నమ్మకమైన వర్గాల నుంచి అందించిన సమాచారం మేరకు.. రవి ప్రకాశ్.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని.. పార్టీతోపాటే.. టీవీ ఛానెల్ కూడా ప్రవేశించనుందని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. అన్నగారితో విభేదాలు ఉన్నాయనే విషయం పైకి చెప్పకపోయినా.. అంతర్గతంగా మాత్రం ఇది నిజమని అంటున్నారు పరిశీలకులు. ఇది టీవీ ఛానెళ్ల కు పాకిందని చెబుతున్నారు.