ఔను.. నిజమే.. ఎందుకంటారా.. మొదటి విడత ఎన్నికల్లో.. ఇప్పుడు రెండోవిడత పంచాయతీ ఎన్నికల్లో నిమ్మగడ్డ అక్రమాలను అడ్డుకోలేక పోతున్నారట.. వైసీపీ ఆగడాలను చూస్తూ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారట. అందుకే.. మీరు వేస్ట్.. మీ అధికారాలు ఉపయోగించుకోవడం లేదు.. వైసీపీని కట్టడి చేయలేకపోతున్నారు..అంటూ నిమ్మగడ్డపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో పుంగనూరు, రొంపిచర్ల, సోమల, చౌడేపల్లి తదితర ప్రాంతాల్లో నామినేషన్లు పెద్దఎత్తున తిరస్కరణకు గురయ్యాయని చంద్రబాబు అంటున్నారు.
అడ్డగోలుగా నామినేషన్లు తిరస్కరించి ఏకగ్రీవాలు చేసుకున్నారని.. తమ అభ్యర్థులకు రక్షణ కావాలని ఎస్‌ఈసీని కోరినా ఫలితం లేకుండా పోయిందని చంద్రబాబు అంటున్నారు. ఎస్‌ఈసీ విఫలమవడం వల్లే హైకోర్టును ఆశ్రయించామని చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎస్‌ఈసీదే బాధ్యతలని.. ఎన్నికల సజావుగా నిర్వహించడంలో ఎస్‌ఈసీ పూర్తిగా విఫలం అయ్యారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. మూడు నియోజకవర్గాల్లో ఎన్నికలు ఆపి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని... మూడు నియోజకవర్గాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎస్‌ఈసీపై ఉందని అన్నారు.
ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో ఎస్‌ఈసీ విఫలమైందని.. ఎస్‌ఈసీ తన అధికారాలు పూర్తిగా ఉపయోగించలేదని.. ఎన్నికల్లో పోటీ చేసే తెదేపా మద్దతుదారులపైనే కేసులు పెడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఏదేమైనా మొదటి నుంచి టీడీపీ తొత్తుగా విమర్శలు ఎదుర్కొన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చివరకు అదే టీడీపీ చేత విమర్శలు ఎదుర్కొంటున్నారు. అదే విచిత్రంగా కనిపిస్తోంది.