రేషన్ సరకులను ఇంటివద్దకే పంపిణీ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రేషన్ ట్రక్ లకు డ్రైవర్లను నియమించి.. వారికి నెల నెలా 21వేల జీతాలిస్తోంది. అయితే ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా..? రేషన్ వాహనాలలో వస్తున్నవారు ఇంటి వద్దకే వచ్చి రేషన్ సరకులు ఇస్తున్నారా? లేక వీధిలోనే నిలబెట్టి సరకులు పంపిణీ చేస్తున్నారా..? గతంలో రేషన్ షాపుల ముందు క్యూ కట్టిన ప్రజలు ఇప్పుడు రేషన్ వాహనాల ముందు క్యూ కడితే ఏంటి ప్రయోజనం?

రేషన్ వాహనాలను లబ్ధిదారుల ఇంటి వద్ద ఆపి సరకులు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే అలా వాహనాలు ఇంటి వద్దకి వచ్చే వరకు ఎవరూ ఆగడంలేదు. వీధిలోకి రేషన్ ట్రక్ వచ్చిందని తెలియడంతోనే.. అందరూ గుమికూడిపోతున్నారు. గతంలో రేషన్ దుకాణాల ముందు కనిపించే క్యూలైన్లే ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. దీనిపై విమర్శలు రావడంతో ప్రభుత్వం సర్దుకుంది. మొబైల్‌ వాహనాలు ఇంటింటికీ వెళ్లి సబ్సిడీ సరుకులను పంపిణీ చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం మున్సిపాల్టీ ఏరియాల్లోనే ఈ పథకం అమలవుతోంది. అయితే పట్టణాల్లో కొందరు ఒకేచోట వాహనాన్ని నిలిపేసి సరుకులు పంపిణీ చేస్తున్నట్లు లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో పౌరసరఫరాల శాఖ అప్రమత్తమైంది. వెంటనే లోపాలను సరిదిద్దేలా చర్యలు తీసుకోవడంతోపాటు సరుకుల పంపిణీ స్పీడును మరింత పెంచాలని అధికారులు ఆదేశించారు.

రాష్ట్రంలో 29,783 రేషన్‌ షాపులుండగా.. వీటిలో పట్టణ ప్రాంతాల్లో ఉన్న 7,426 షాపుల పరిధిలోనే ప్రస్తుతం ఇంటింటికీ రేషన్‌ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది.

గ్రామాల్లో ఎప్పుడు..?
పంచాయతీ ఎన్నికల కారణంగా గ్రామాల్లో ప్రస్తుతం రేషన్ పంపిణీ ఇంకా మొదలు కాలేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో వేసిన పిటిషన్ పై వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు తీర్పు వాయిదా వేశారు. ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసే వాహనాల రంగులు మారిస్తేనే గ్రామాల్లో రేషన్ పంపిణీకి అనుమతిస్తామని ఎన్నికల కమిషన్ పేర్కొంది. అయితే దానికి నెలల తరబడి సమయం పడుతుందని, తిరిగి రంగులు మార్చాలంటే వృథా ఖర్చు అని ప్రభుత్వం వాదిస్తోంది. కోర్టు తీర్పు ప్రకారం ఈ పథకం అమలు ముందుకు సాగే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: