ఇప్పుడు ఈ విషయం వైసీపీ సర్కారుకు అస్త్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాష్ట్రంలో నివాసమే ఉండకుండా ప్రతినెలా ఇంటి అద్దె అలవెన్స్ పొందుతున్నట్టుగా వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు చేపట్టాలంటూ గవర్నర్ కార్యాలయం ఆదేశించిందట. ఈ విషయాన్ని యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్‌టీఐ క్యాంపెయిన్ సంస్థ ప్రతినిధులు బయటపెట్టారు. ఈ మేరకు తమకు గవర్నర్ కార్యాలయం సమాచారమిచ్చిందని వారు చెబుతున్నారు. ఈ సంస్థ ప్రతినిధులు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై గత డిసెంబర్ 14న గవర్నర్‌కు ఫిర్యాదు చేశారట.
మా ఫిర్యాదుపై ఏం చేశారంటూ తాజాగా మరోసారి ఈ సంస్థ ప్రతినిధులు జంపాన శ్రీనివాసగౌడ్, నస్రీన్‌బేగంలు తాజాగా గవర్నర్ కార్యాలయం నుంచి సమాచారం కోరారట. దీనికి స్పందించిన గవర్నర్ కార్యాలయ కార్యదర్శి ముఖేష్‌కుమార్ వారికి సమాధానం పంపారట. దాని ప్రకారం చూస్తే.. ఆ ఫిర్యాదుపై తగిన విచారణ జరిపి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శిని డిసెంబర్ 24న ఆదేశించినట్టు తెలిసిందట.
మరి నిన్న మొన్నటి వరకూ పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిపై నిమ్మగడ్డ ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ మీటింగ్‌లకు ఏర్పాట్లు చేయాల్సిన రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి చివరకు సుప్రీం కోర్టు చెప్పే వరకూ స్పందించని సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఈ రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఈసీ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో.. చూడాలి మరి.