గ్రామాల్లో జనసేన బలంగా ఉందని పంచాయతీ ఫలితాల గణాంకాలే చెబుతున్నాయంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు. జనసేన మద్దతుదారుల గెలుపుతో మార్పు మొదలైందంటున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లు, బెదిరింపులు తట్టుకొని కూడా జనసేన మద్దతు దారులు ఎన్నికల్లో నిలిచారంటూ పవన్ కల్యాణ్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉండీ అధికార పార్టీవాళ్ళు భయపడుతున్నారని.. తొలి రెండు దశల్లో చూపిన స్ఫూర్తిని జనసేన కార్యకర్తలు మలి దశల్లోనూ చూపించాలంటూ పవన్ కల్యాణ్ పిలుపు ఇచ్చారు.
ఇక పంచాయతీ ఎన్నికల్లో జనసేన ఫలితాల తీరును వివరించిన పవన్ కల్యాణ్.. మొదటి విడతలో తమ పార్టీ 18 శాతానికి పైగా ఓట్లు సాధించిందని చెప్పారు. రెండో విడతలో అది 22 శాతం దాటిందన్న పవన్ కల్యాణ్.. అధికార పార్టీ బెదిరింపులు తట్టుకొని నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు తెలిపారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను అధికార పార్టీ ఎమ్మెల్యేలు దుర్వినియోగం చేస్తున్నారని.. వాలంటీర్ల పరిధిలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు.
పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయని వారికి సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారన్న పవన్ కల్యాణ్.. కడప జిల్లాలో జనసేన పార్టీ మద్దతుదారుడిని కిడ్నాప్ చేయడం బాధాకరమన్నారు. జనసేన మద్దతుతో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులకు అభినందనలు తెలిపారు. ఇదే తరహా స్ఫూర్తి మిగతా రెండు విడతల్లో కూడా పోరాట స్ఫూర్తిని కనబరుస్తూ మంచి ఫలితాలు సాధించాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.