అంతర్వేది లక్ష్మీ నృసింహస్వామి నూతన రథానికి 5 రకాల రంగులు వేసి  ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. కేవలం రెండు వారాల  వ్యవధిలో రథానికి రంగులు వేసేశారు. చెన్నై నుండి పెయింటర్లను రోజు వారి వేతనంపై  తీసుకుని వచ్చి  కలర్స్ ఫిల్ చేశారు.   ఏడంతస్థులు ఉన్న రథాన్ని పంచ రంగులతో చూడ ముచ్చటగా తీర్చిదిద్దారు. పాత రథానికి ఏ మాత్రం తీసిపోని విధంగా రథాన్ని  సిద్ధం చేశారు.

గతంలో రథోత్సవాలు జరిగిన సమయంలో జరిగిన చిన్న,  చిన్న  తప్పిదాలను దృష్టిలో  పెట్టుకొని  రథానికి  స్టీరింగ్, బ్రేక్ లు  అమర్చారు. నూతన రథానికి పూర్తి స్థాయి  రక్షణ కల్పించేలా అంతర్వేది ఆలయ ప్రాంగణంలో ఉన్న 50 అడుగుల షెడ్డుకు మెరుగులు దిద్దారు.  

షెడ్ కు మూడు వైపులా గోడలు అలాగే ఉంచి, ప్రవేశ ద్వారం వద్ద తాటాకులతో కట్టేవారు. ఇప్పుడు ఇనుప గేటు పెట్టడంతోపాటు  పూర్తి స్థాయి సెక్యూరిటీ కల్పించారు దేవాదాయ శాఖ అధికారులు. అంతర్వేది లక్ష్మీ నృసింహస్వామి ఆలయం ఎంత ప్రసిద్ధి చెందినదో, ఇక్కడి రథం కూడా అంతే ప్రాముఖ్యత కలిగింది. రథాన్ని కూడా  లక్ష్మీ నృసింహస్వామి వారిగా భావించి భక్తులు  దర్శించుకుంటారు. అందుకే నూతన  రథం నిర్మాణంలో  ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. భక్తుల మనోభావాలకు అనుగుణంగా రథం నిర్మాణం  చేపట్టి పాతరథం దగ్ధం ఘటనలో ఎదురైన అపవాదులు తొలగించుకోవాలని ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంది.  

భీష్మ ఏకాదశి రోజున  లక్ష్మీ నృసింహస్వామి కల్యాణం అనంతరం  ఈనెల  23వ తేదీన ఈ కొత్త రథంపై స్వామి వారి రథోత్సవం జరుగనుంది. అంతర్వేది లక్ష్మీ నృసింహస్వామి రథోత్సవానికి  వందల సంవత్సరాల సంప్రదాయం ఉంది.  62 ఏళ్ల నాటి పాత రథం పైనే ఇన్ని  సంవత్సరాలు  రథోత్సవం జరిపారు. గత ఏడాది సెప్టెంబర్ 5న అర్థరాత్రి  ఒంటి గంటకు జరిగిన  అగ్నిప్రమాదంలో  పాత రథం దగ్ధం అయింది.  దాని స్థానంలోనే   కొత్త రథం నిర్మాణం  జరిగింది.  రికార్డు స్థాయిలో 3 నెలల  కాలవ్యవధిలో నిర్మాణం పూర్తి చేయటం ఓ అద్భుతంగా భక్తులు చెప్పుకుంటున్నారు.  అంతా  లక్ష్మీ నృసింహస్వామి సంకల్పమేనని  భావిస్తున్నారు.  

అంతర్వేది లక్ష్మీ నృసింహస్వామి అంటే  కోనసీమ ప్రాంత వాసులకు ఎంతో  నమ్మకం, భక్తి.  అందుకే  లక్ష్మీ నృసింహస్వామిని  కోనసీమ వాసులు  కుటుంబసభ్యునిగా  భావిస్తారు. లక్ష్మీ నృసింహస్వామి  కళ్యాణం అయితేనే గానీ  కోనసీమ ప్రాంత వాసులెవరూ పెళ్లిళ్లు  చేసుకోరు. స్వామి వారి కల్యాణాన్ని  కనులారా  తిలకించడం ఆనవాయితీ.  అంతర్వేది  రథోత్సవంలో పాల్గొని  దర్శించుకోవడం,  అలాగే  రథాన్ని  మాడవీధుల్లో లాగుతూ తీసుకుని  వెళ్ళి  లక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకోవడం  మరో ప్రత్యేకత. అందుకే  భక్తుల మనోభావాలు  దెబ్బ తినకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ రథ నిర్మాణం చేపట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: