పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని వీవర్స్ కాలనీలో నాగభూషణం అలియాస్ చిట్టి అనే వ్యక్తి డ్రైవర్ గా పనిచేస్తుండేవాడు. అతడికి నల్లమాడ మండలం మీసాలవాండపల్లికి చెందిన ఈశ్వరమ్మతో కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఈశ్వరమ్మకు ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయం పచ్చని సంసారాన్ని నాశనం చేసింది. అతడితో ఏర్పడిన వివాహేతర సంబంధం కోసం భర్తనే హతమార్చాలనుకుంది.
పక్కా ప్లాన్ ప్రకారం ఇంట్లోనే భర్తను చంపేసి తన ప్రియుడు, మరో ముగ్గురు వ్యక్తుల సహాయంతో భర్త మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పూడ్చిపెట్టింది. ఆ తర్వాత పథకం ప్రకారం తన భర్త ఎక్కడికో వెళ్లాడని, బంధువుల ఇళ్లకు కూడా వెళ్లలేదని చుట్టుపక్కల వారితో చెప్పి వాపోయింది. ఆ తర్వాత పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు.రెండు రోజుల క్రితం ముదిగుబ్బలో గుర్తు తెలియని శవం ఒకటి బయటపడింది. అక్కడ ఆ మృతదేహం తన భర్తది కాదని చెబుతూనే అనుమానాస్పదంగా ప్రవర్తించింది.
దీంతో భర్త మిస్సింగ్ కేసులో ఆమెపైనే పోలీసులు అనుమానించి ఆరా తీశారు. భర్త మిస్సింగ్ కు ఆమే కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు, ఆ తర్వాత ఆమెను విచారించారు. ఎట్టకేలకు ఈశ్వరమ్మ నిజం ఒప్పుకుంది. భర్తను తానే చంపానని పోలీసులకు చెప్పింది. ప్రియుడు, మరో ముగ్గురితో కలిసి భర్త మృతదేహాన్ని పిల్లవంక కాలనీ సమీపంలో పూడ్చిపెట్టానని చెప్పింది. మొత్తానికి భర్తను చంపిన 54 రోజుల తర్వాత భార్య బండారం బయటపడినట్టయింది. ఆమెను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.