తాజాగా వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓవ్యక్తిని అతి కిరాతకంగా హతమార్చి చెరువులో పడేశారు. ఈ ఘటన బొంరస్పేట మండలంలోని మెట్లకుంట గ్రామంలో చోటుచేసుకుంది. మెట్లకుంట గ్రామానికి చెందిన కుర్వ చంద్రయ్య (52)అనే వ్యక్తి రెండు రోజులుగా కనిపించడంలేదు. దీంతో కుటుంబసభ్యులు స్థానికుల సాయంతో వెతుకుండగా, గ్రామ శివారులో శవమై కనిపించాడు. చంద్రయ్యను గుర్తు తెలియని దుండగులు అతికిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్లకుంట గ్రామానికి చెందిన కుర్వ చంద్రయ్యను గ్రామ శివారులోని ఎల్లమ్మ చెరువు దగ్గర గుర్తు తెలియని దుండగులు తల, మొండెం వేరు చేసి అతి దారుణంగా హతమర్చారు. తల చెరువులో వేయగా.. మొండెం చెట్ల పొదల్లో పడేశారు.
అయితే ఇదిలావుంటే, ఆదివారం రోజున పొలం పనుల కోసం వెళ్లిన చంద్రయ్య తిరిగి ఇంటికి రాకపోవడంతో సోమవారం కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతలో చంద్రయ్య శవం విడి భాగాలుగా లభ్యమైంది. మృతదేహన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ హత్యకు కారణంగా భావిస్తున్న ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.