ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు రాజీనామా చేస్తారా..? నిప్పులా బతికా.. అని గొంతు చించుకున్న నాయకుడు.. తనపై ఎఫ్.ఐ.ఆర్ నమోదైతే..పదవి నుంచి తొలగిపోయి.. వేరొకరికి అవకాశం ఇస్తారా..? ఒకవేళ అదే జరిగితే ఎవరికి అవకాశం ఇస్తారు.. కొడుకు లోకేష్ కా.. బావమరిది బాలయ్యకా..? ఇప్పుడీ చర్చ ఆసక్తి కలిగిస్తోంది.
చంద్రబాబు రాజీనామానా.. అంత సీన్ లేదని తీసిపారేయకండి. నిప్పులేకుండా పొగరాదు కదా.. అందులోనూ.. బాబు రాజీనామాపై ముంబై మిర్రర్ అనే పత్రిక ఇంట్రస్టింగ్ స్టోరీ ఇచ్చింది. అంతే కాదు.. తన స్థానంలో కేంద్ర విమానాయన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజును కూర్చొబెట్టాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు ఆ పత్రిక కథనం వెలువరించింది. అశోక్ గజపతిరాజు.. కేంద్రమంత్రిగా ఉన్నారు కాబట్టి.. చంద్రబాబు ఈ సమాచారం ప్రధాని నరేంద్రమోడీ, బీజీపీ అధ్యక్షులు అమిత్‌షా దృష్టికి కూడా తీసికెళ్లారట.
బాబు తప్పుకోక తప్పదా..?
తెలంగాణ ఏసీబీ రేవంత్ రెడ్డి కేసులో పక్కా ఆధారాలు సంపాదించడంతో.. ఎఫ్.ఐ.ఆర్ లో చంద్రబాబు పేరు చేర్చడం ఖాయమే అని తేలిపోయింది. ఈ వివాదం నుంచి జనం దృష్టి తప్పించేందుకు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూను తెగ ప్రచారం చేస్తున్నా.. అదేదీ చంద్రబాబును కాపాడే అవకాశం కనిపించడంలేదు. శిక్ష పడుతుందా.. పడదా అనేది వేరే విషయం. కానీ ఓ ముఖ్యమంత్రి లంచమిచ్చే కేసు ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు చేసుకోవడమే దేశంలో ఇదే మొదటిసారి.
ముంబై మిర్రర్ సంచలన కథనం..
ఇప్పటికే ఈ ఓటు కు నోటు వ్యవహారంతో ఇంటాబయటా చంద్రబాబు పరువుకు జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. జాతీయ ఛానెల్స్ కూడా చంద్రబాబును ఇంటర్వ్యూల పేరుతో ఇంటరాగేషన్ చేసి.. బాబు బెరుకును, ఉక్రోశాన్ని రాబట్టాయి. ఐతే.. ముంబై మిర్రర్ పత్రిక చెప్పినట్టు చంద్రబాబు రాజీనామా చేస్తే.. లోకేశ్ ను, బాలయ్యను కాదని అశోక్ కు పగ్గాలు అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నట్టు వస్తున్న ఈ కథనం టీడీపీలోనూ కలకలం రేపుతోంది.
అశోక్ కు నీతిమంతుడుగా పేరున్నా.. ఆయన ఆ పోస్టులో నెగ్గుకొస్తారా అన్నది చూడాలి. ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక మంత్రి నారాయణ పేర్లు కూడా చర్చకు వచ్చాయట. బాలయ్య పేరు కూడా ప్రస్తావనకు వచ్చినా.. చంద్రబాబు అశోక్‌గజపతి రాజువైపే మొగ్గు చూపుతున్నారట.