నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఈ పేరు చెబితేనే కొన్ని నెలలుగా వైసీపీ నాయకులు మండిపడేవారు. ఆయన ఎన్నికల కమిషనర్‌గా ఉన్నంత కాలం అసలు ఎన్నికలు నిర్వహించేదే లేదని భీష్మించుకున్నారు. చివరకు సుప్రీంకోర్టు వరకూ పోరాడారు. కానీ ఫలితం దక్కలేదు. నిమ్మగడ్డ ఆధ్వర్యంలోనే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా సీన్ మారిపోయింది.

పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అద్భుత విజయాలు అందుకోవడంతో ఇప్పుడు వైసీపీ శ్రేణులు మిగిలిన ఎన్నికలు కూడా పెట్టండి ప్లీజ్ అంటూ బతిమాలుకుంటున్నాయి. ప్లీజ్ నిమ్మగడ్డ గారూ.. మధ్యలో నిలిచిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా మీరే నిర్వహించండి ప్లీజ్ అంటూ కోరుతున్నారు. హైకోర్టు తీర్పుతో ఏకగ్రీవాలకు అడ్డు తొలగిపోయిందని, న్యాయపరమైన అవరోధాలన్నీ తొలగిపోయాయని.. అందుకే మధ్యలో నిలిచిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిమ్మగడ్డ నిర్వహించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు.

నిమ్మగడ్డ తలచుకుంటే ఆరు రోజుల్లో  ఈ ఎన్నికలు నిర్వహించ వచ్చని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  చెబుతున్నారు. కరోనా కారణంగా పరిషత్‌ ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌..ఆ తరువాత ఎక్కడ నుంచి నిలిపివేశామో అక్కడి నుంచి మొదలుపెడుతామని కోర్టుకు చెప్పారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అడ్డంకులు లేవని.. ఆరు రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయవచ్చని చెబుతున్నారు.


ఎన్నికల కమిషనర్ తప్పకుండా ఈ ఎన్నికలు నిర్వహించాలని.. అన్ని ఎన్నికలు నిమ్మగడ్డనే నిర్వహించారు కాబట్టి..ఈ ఎన్నికలు కూడా పూర్తి చేసి రిటైర్డు అయితే బాగుంటుందని పెద్దిరెడ్డి కోరారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవంతరాలు చోటు చేసుకోకుండా ఎన్నికల కమిషనర్‌ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తొందరగా ఎన్నికలు ముగిస్తే..ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై దృష్టి సారిస్తుందని.. ఇప్పటికే పోలీసులు, అధికారులు ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేశారని ఆయన అంటున్నారు. మొత్తానికి నిమ్మగడ్డ వద్దే వద్దన్న వారే.. ఇప్పుడు ఆయనే కావాలని కోరడం వింతగా లేదూ..?

మరింత సమాచారం తెలుసుకోండి: