త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో అనేక మంది పోటీ చేస్తున్నారు. చాలా మంది ప్ర‌ధాన‌పార్టీల త‌ర‌ఫున పోటీ చేస్తున్నారు. మ‌రికొంద‌రు స్వతంత్రులుగా రంగంలోకి దిగారు. అయితే.. ఒక వ్య‌క్తి మాత్రం అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తున్నారు. ఆయ‌న నాగర్‌కోవిల్‌ కృష్ణన్‌కోవిల్‌ ప్రాంతానికి చెందిన ఫోటోగ్రాఫర్‌ నాగూర్‌మీరా పీర్‌ మహమ్మద్‌. 61 ఏళ్ల మీరా.. ఎందుకు అంద‌రినీ ఆక‌ర్షిస్తున్నారంటే.. ఆయ‌నేమీ ప్ర‌ధాన పార్టీల త‌ర‌పున బ‌రిలో దిగ‌డం లేదు. లేదా.. ఇప్ప‌టికి ఓ నాలుగైదు సార్లు విజ‌యం సాధించిన హిస్ట‌రీని కూడా ఆయ‌న సొంతం చేసుకోలేదు.
పోనీ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో ఆయ‌నేమీ త‌మిళ రాజ‌కీయాల‌ను వేడెక్కించ‌డ‌మూ లేదు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ్యాన్ ఆఫ్ ది రికార్డ్‌గా మారారు. ఎందుకంటే.. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు  51వ సారి ఎన్నికల్లో పోటీకి దిగారు. పీర్‌మహమ్మద్‌ ఇప్పటివరకూ 50సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ నియోజక వర్గాల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

గత 2016 ఎన్నికల్లో నాంగునేరి శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేసి ఎప్పటిలాగే డిపాజిట్‌ను కోల్పోయారు.  తాజాగా కన్నియాకుమారి లోక్‌సభ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ దాఖలు చేశారు. తనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవని, తన వద్ద రూ.50 వేల నగదు మాత్రమే వుందని నామినేషన్‌తో జతపరచి అఫిడ‌విట్‌లో పేర్కొన్నారు. పీర్‌మహమ్మద్‌ నామినేషన్‌ సక్రమంగా ఉందని ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఆరో తరగతి వరకు చదివిన ఆయన ఫోటోగ్రాపర్‌గా వుంటూ చాలీచాలని సంపాదనతో జీవిస్తున్నారు. ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయడమే హాబీగా పెట్టుకున్నారు. అయితే.. ఇలానే మ‌రో వ్య‌క్తి ఉన్నారు. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు 40 సార్లు పోటీ చేశారు. అయితే ఎప్పుడూ విజ‌యం ద‌క్కించుకోక‌పోవడం వీరిద్దిరికీ ఉన్న రికార్డ్‌. దీంతో ఈ ఇద్ద‌రి అంశం.. ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: