చంద్రబాబు మొదలు పెట్టిన ఓ పనిని జగన్ పూర్తి చేశారు. వీరిద్దరి చొరవతో కర్నూలు విమానాశ్రయం పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తోంది. ఈనెల 25న సీఎం జగన్, కేంద్ర పౌర విమానయాన మంత్రి హరదీప్ సింగ్.. ఈ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేస్తారు. ఈనెల 28నుంచి ఇండిగో విమానాల రాకపోకలు ఇక్కడ మొదలవుతాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర విమానయాన శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి.


రూ.153 కోట్ల ఖర్చుతో ఓర్వకల్లు వద్ద ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. కర్నూలులో ఎయిర్ పోర్ట్ దాదాపు 20ఏళ్ల కిందటి ప్రతిపాదన. వైఎస్ఆర్ ముఖ్యమత్రిగా ఉన్నప్పుడే భూ సేకరణ జరగాల్సి ఉన్నా.. వివిధ కారణాల వల్ల అది వాయిదా పడింది. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో ముందడుగు పడింది. టీడీపీ హయాంలో 2014లో కర్నూలు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలోని ఓర్వకల్లు వద్ద 1,008 ఎకరాల్లో ఎయిర్ ‌పోర్టు నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. రన్ వే నిర్మాణం ఇతర పనులు పూర్తయ్యాయి. 2019 జనవరి 18న ఈ విమానాశ్రయాన్ని అప్పటి ముఖ్యంత్రి చంద్రబాబు ప్రారంభించారు. 2019 ఏప్రిల్ నుంచి విమానాల రాకపోకలు మొదలవుతాయని ప్రకటించారు. అయితే కొన్ని పనులు జాప్యం కావడంతో విమానాల రాకపోకలు పూర్తి స్థాయిలో మొదలు కాలేదు.

వైసీపీ హయాంలో చకచకా పనులు పూర్తి..
వైసీపీ హయాంలో సీఎం జగన్ కర్నూలు విమానాశ్రయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏడాదిన్నర కాలంలోనే బ్యాలెన్స్ ఉన్న పనులన్నీ పూర్తయ్యాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులకు అదనంగా రూ.75 కోట్లను కేటాయించి పనులు పూర్తి చేయించారు. ప్యాసింజర్స్ టెర్మినల్ బిల్డింగ్, ఐదు ఫ్లోర్లతో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్, అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్, పోలీస్‌ బ్యారక్, ప్యాసింజర్‌ లాంజ్, వీఐపీ లాంజ్, సబ్‌ స్టేషన్, వాటర్‌ ఓవర్‌ హెడ్‌ ట్యాంకు తదితర పనులన్నీ సకాలంలో పూర్తయ్యాయి. 2019లో ఏటీసీ, 2020 జనవరి 16న డీజీసీఏ అనుమతులు ఎయిర్ పోర్ట్ కి లభించాయి. ఏరోడ్రోమ్‌ లైసెన్స్ కూడా మంజూరైంది. దీంతో విమానాల రాకపోకలకు లైన్‌ క్లియర్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: