గుంటూరు జిల్లా బాప‌ట్ల‌లో టీడీపీ జెండా ఎగ‌రేయాల‌ని.. పార్టీ అధినేత చంద్ర‌బాబు.. స్థానికంగా వేగేశ్న న‌రేంద్ర వ‌ర్మ‌లు.. వ్యూహాత్మ ‌కంగా ముందుకు సాగుతున్నారు. ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు. పార్టీ ప‌టిష్ట‌త‌కు కృషి చేస్తున్నారు. అయితే.. దీనికి భిన్నంగా ఇప్పుడు పార్టీలో క‌ల‌క‌లం రేగింది. ఏకంగా జ‌గ‌న్‌ను ప్ర‌శంసిస్తున్నారు పార్టీ త‌మ్ముళ్లు. దీంతో అస‌లు ఇక్క‌డ ఏం జ‌రుగుతోంద‌నే విష‌యం పార్టీలోను, రాజ‌కీయంగాను కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అధికార పక్షం ఏం చేసినా విమర్శించాలి’ అనే ధోరణి మానుకోవాలనే విషయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను చూస్తే అర్థమవుతోందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర మాజీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి మంతెన అనంతవర్మరాజు చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి.

అంత‌టితో కూడా ఆగ‌ని వ‌ర్మ‌... ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాపట్ల ప్రాంతానికి రూ.500 కోట్లతో వైద్య కళాశాల మంజూరు చేయటం, జిల్లా కేంద్రంగా బాపట్లను చేసేందుకు సానుకూలంగా స్పందించటం చూస్తుంటే ఈ ప్రాంతానికి చెందిన ప్రతి ఒక్కరూ ఆయనకు మద్దతు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బాపట్ల ప్రాంతం అభివృద్ధి జిల్లా ఏర్పాటుతోనే సాధ్యమని, ఇందుకు కోన ప్రభాకరరావు చేసిన కృషిని అందిపుచ్చుకుని ఆయన తనయుడు, ఉప సభాపతి కోన రఘుపతి అవకాశం ఉన్నప్పుడల్లా జిల్లా ప్రస్తావనను తెరమీదకు తీసుకురావటం అభినందనీయమన్నారు.

చరిత్ర కలిగిన బాపట్ల ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న రఘుపతికి రాజకీయాలకు అతీతంగా అంతా సహకరించాలని కోరారు. మునిసిపాలిటీని ఏకగ్రీవం చేసుకుని ముఖ్యమంత్రికి, కోన రఘుపతికి బహుమతిగా ఇద్దామని కోరారు. రాజకీయ నాయకులుగా విధానపరమైన విషయాలపై వ్యతిరేకిద్దామని, బాపట్ల అభివృద్ధి విషయంలో ఏకతాటిపై నిలిచి అంతా కోన రఘుపతికి మద్దతుగా నిలవాలని కోరారు.

దీంతో ఇప్పుడు ఈ విష‌యంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. నిన్న‌గాక మొన్న పార్టీలోకి వ‌చ్చిన నాయ‌కులు.. అయితే ఏదైనా చేయొచ్చు.. కానీ.. సీనియ‌ర్లు కూడా ఇప్పుడు ఇలా యూట‌ర్న్ తీసుకోవ‌డం వెనుక ఏంజ‌రిగింద‌నే కోణంలో పార్టీ అధినేత చంద్ర‌బాబుకు ఫిర్యాదు అందింద‌ని అంటున్నారు.మ‌రి వ‌ర్మ‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారోచూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: