సీఎం జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు బాగున్నా.. వ‌ర్క‌వుట్ అవుతాయా?  ప్ర‌జ‌లు ఎలా అర్ధం చేసుకుం టారు?  ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శించ‌కుండా ఉంటాయా? ఇవీ.. ఇప్పుడు మంత్రి వ‌ర్గంలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న ప్ర‌శ్న‌లు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. రెండు కీల‌క నిర్ణ‌యాలు ఉన్నాయి. ఒక‌టి.. విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీలో ఉత్ప‌త్తి అవుతున్న ఆక్సిజ‌న్‌ను దేశంలోని ఇత‌ర ప్రాంతాల‌కు త‌ర‌లించేందుకు తాజాగా జ‌గ‌న్ అంగీకారం చెప్ప‌డం. అదేంటి? అనుకుంటున్నారా?  ఇది కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ క‌దా.. జ‌గ‌న్ అనుమ‌తి ఎందుకు అనుకుంటున్నారా? అక్క‌డే ఉంది అస‌లు విష‌యం.

కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థే అయినా.. రాష్ట్రానికి ఇందులో ఉత్ప‌త్తి అయ్యే వాటిపై కొంత హ‌క్కు ఉంటుం ది. అలానే ఆక్సిజ‌న్‌లోనూ కొంత వాటా ఉంటుంది. ప్ర‌స్తుత విప‌త్క‌ర ప‌రిస్థితిలో ఈ వాటాను పూర్తిగా ఏపీ వినియోగించుకునే అవ‌కాశం ఉంది. అయితే.. మ‌హారాష్ట్ర‌, యూపీ, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ఆక్సిజ‌న్ కొర‌త నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం.. ఏపీ వాటాను కూడా తీసుకుంటామ‌ని నోట్ పంపింది. దీనికి ఏపీ స‌ర్కారు ఓకే చెప్పింది. దీంతోనే విశాఖ నుంచి మ‌హారాష్ట్ర‌కు ఆక్సిజ‌న్ త‌ర‌లింద‌ని ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ఇప్పుడు తాజాగా జ‌రిగిన మంత్రి వ‌ర్గ భేటీలో ఈ విష‌యాన్ని నెమ్మ‌దిగా చ‌ర్చించారు. దీనిపై కొంద‌రు మంత్రులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఇక‌, మ‌రో విష‌యం.. అమూల్ పాల విస్త‌ర‌ణ‌. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో ఉన్న డైయిరీల‌ను 50 శాతం వ‌ర‌కు మూసేయాల‌ని తాజాగా నిర్ణ‌యం తీసుకున్నారు. దీనిపై కూడా మంత్రులు అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. కేవ‌లం అమూల్ కోసం.. ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం ద్వారా.. రాష్ట్రంలో విప‌క్షాల‌కు మ‌రింత టార్గెట్ అవుతామ‌ని భావిస్తున్నారు.

ఒక‌వైపు.. ఇప్ప‌టికే విప‌క్షాలు అనేక విమ‌ర్శ‌లు చేస్తున్న నేప‌థ్యంలో ఇప్పుడు అమూల్ స‌హా ఆక్సిజ‌న్ విష‌యంలో ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం ద్వారా.. మ‌రింతగా టార్గెట్ అవుతామ‌ని.. అంటున్నారు. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ వీటిని ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: