ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల సంఘం పాత్ర ఎంతో కీలకం. స్వతంత్య్ర‌ వ్యవస్థగా ఉండే ఈ సంస్థ ఎంత చురుగ్గా పని చేస్తే.. ప్రజాస్వామ్యం అంతలా పరిఢవిల్లుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సీఈసీ మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే. ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహించటాన్ని పలువురు తప్పు పట్టినా.. పట్టించుకోలేదు. అంతేనా.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారీ సభలు.. పెద్ద పెద్ద ర్యాలీల నిర్వహణకు అనుమతులు ఇవ్వకూడదని.. పరిమితులు విధించాలన్న అప్పీలును లైట్ తీసుకోవటం తెలిసిందే.

ఈ రోజున దేశంలో ఇంత భారీగా కేసులు నమోదు కావటానికి కారణం.. కేంద్ర ఎన్నికల సంఘం తీరు కూడా ప్రధానమని తప్పు పట్టే వారు లేకపోలేదు. సెకండ్ వేవ్ ను పరిగణలోకి తీసుకొని ఎన్నికల వేళ.. చేపట్టాల్సిన చర్యల మీద కఠిన ఆంక్షలు విధించి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయం ఉంది. అయినప్పటికీ.. అలాంటి నిర్ణయాన్ని ప్రకటించని కేంద్ర ఎన్నికల సంఘం.. జరుగుతున్న పరిణామాల్ని చూస్తూ ఉండిపోయిందే కానీ.. కనీసం స్పందించలేదు. చివరకు సీఈసీ తీరును న్యాయస్థానాలు సైతం తప్పు పట్టే దుస్థితి.ఇదిలా ఉండగా.. తాజాగా కేంద్ర ఎన్నిక సంఘం స్పందించింది.

మే 2న విడుదలయ్యే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయంలో ఆంక్షల్ని విధిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. ఫలితాలు వెలువడే రోజు.. ఆ తర్వాత విజయోత్సవ ర్యాలీల్ని నిషేధించటంతో పాటు..ఎన్నికల్లో గెలిచిన వారెవరూ సంబరాలు నిర్వహించొద్దని స్పష్టం చేసింది. అంతేకాదు.. బ్యాలెట్ పోరులో విజేతలుగా నిలిచిన అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకునే వరకు వారి వెంట ఇద్దరు మాత్రమే ఉండాలని.. అంతకు మించి ఉండకూడదని స్పష్టం చేసింది.

కరోనా వ్యాప్తికి అన్ని రాజకీయ పార్టీలు తాము విధించిన పరిమితుల్ని దాటొద్దని హెచ్చరించింది. బెంగాల్ లో ఏడు దశల పోలింగ్ పూర్తి కాగా.. ఈ నెల 29న (గురువారం) ఎనిమిదో దశ పోలింగ్ జరగనుంది. ఇవాల్టితో ప్రచారం ముగియనుంది. అయితే.. ఈ మధ్యన కేసులు తీవ్రంగా పెరిగిపోవటంతో ర్యాలీలు.. పాదయాత్రలపై నిషేధాన్ని విధించింది. తాజాగా విజయోత్సవ ర్యాలీలపై కీలక ప్రకటనను జారీ చేయటం ద్వారా.. తాను ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తున్నానే తప్పించి.. తనపై వస్తున్న ఆరోపణలకు తగ్గట్లు.. చేష్టలుడిగినట్లుగా ఉండలేదన్న సందేశాన్ని పంపినట్లుగా చెప్పక తప్పదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: