ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే దేశంలో ఉన్న పలు వ్యాక్సిన్ తయారీ సంస్థలు తమ టీకా ధరను నిర్ణయించాయి. ఎక్కువ శాతం కంపెనీలు తమ వ్యాక్సిన్ ధరను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే తాజాగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను తగ్గిస్తున్నట్లు సీఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆదార్ పూనావాలా తెలిపారు. దీంతో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర రూ.300 విక్రయిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటివరకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు రూ.400 టీకా అమ్ముతున్నారు. కరోనా విజృంభణ దృష్ట్యా ప్రతి పేదవాడికి టీకా అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల రూ.కోట్లలో రాష్ట్ర నిధులు ఆదా అవుతాయని, వాటితో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయవచ్చన్నారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 340 మిలియన్ డోసులు, ప్రైవేటు ఆస్పత్రుల నుంచి 20 మిలియన్ డోసుల మేర ఆర్డర్లు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఈ వ్యాక్సిన్ ఇంకా కావాలని కోరుతున్నాయన్నారు. రానున్న నాలుగు రోజుల్లో తమ టీకా మందు కొన్ని రాష్ట్రాలకు సప్లయ్ అవుతుందని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ వెల్లడించారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్రతోపాటు మరో 5 రాష్ట్రాల్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అయితే మిగిలిన రాష్ట్రాలకు మరో మూడు వారాల్లో సప్లయ్ చేసే అవకాశం ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
కాగా, మే1 నుంచి 18 ఏళ్ల వయస్కులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతోంది. మూడో దశ వ్యాక్సినేషన్ కింద 18 ఏళ్ళు, అంతకన్నా వయస్సు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కాగా, ఈ టీకాను కేంద్రానికి ఒక ధర, రాష్ట్రాలకు ఒక ధర నిర్ణయించడమేమిటంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన సీరం ఇనిస్టిట్యూట్ సీఈఓ.. పరిమితంగా కొన్ని డోసుల వరకే ప్రైవేటు ఆస్పత్రులకు డోసుకు రూ.600 సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అయితే కేంద్రం మాత్రం ఇలా వ్యాక్సిన్ ఉత్పాదక సంస్థలతో ముందే తాము ఒప్పందం కుదుర్చుకున్నామని, దాని ప్రకారమే ధరను కేటాయించామని పేర్కొంటున్నాయి.