ఆంధ్రప్రదేశ్‌లోని ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచామని సీఎం జగన్ ప్రధాన మంత్రి మోడీకి తెలిపారు. కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రధానికి సీఎం జగన్ వివరించారు. స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ ప్రధానికి తెలిపారు. దేశంలోని కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన ప్రధాని మోడీ.. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న.. మరణాలు ఎక్కువవుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసినట్టు తెలిసింది.
ఇక ఏపీ విషయానికి వస్తే.. ఇక్కడ కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. ఏకంగా రోజూ 20వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా సర్కారు లెక్కల ప్రకారమే 70 దాటుతోంది. అంతే కాదు.. ఏపీలో విస్తరిస్తున్న వైరస్ అత్యంత ప్రమాదకరమైన వైరస్ మ్యూటెంట్‌గా చెబుతున్నారు. ఏపీలో ప్రస్తుతం N440k వైరస్ మ్యూటెంట్ అని హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్లులార్ అండ్ మాలెక్యులర్ బయాలజీ.. నిపుణులు చెప్పారన్న విషయం బాగా ప్రచారం జరిగింది.
అయితే అలాంటిదేమీ లేదని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. మరోవైపు ఏపీలో విపక్ష నేత చంద్రబాబు కరోనా పై రోజూ ప్రెస్ మీట్లు పెడుతూ సర్కారుపై ఒత్తిడి పెంచుతున్నారు. ఏపీలో సర్కారు ఘోరంగా విఫలమైందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నేరుగా జగన్‌కు ఫోన్ చేసి మాట్లాడటం విశేషంగానే చెప్పుకోవాలి.