వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ ఏం చెబుతుందంటే.. “ ప్రస్తుతం భారతీయులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. రోజుకు 3.78 లక్షల కేసుల చొప్పున మే 4నాటికి దాదాపు 2.20 కోట్లకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 2.22 లక్షల మందికిపైగా మరణించారు. వీటిని భారీ సంఖ్యలో తగ్గించి చూపుతున్నట్లు నిపుణులు నమ్ముతున్నారు.” అంటోంది వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్.
ప్రస్తుతం భారత్‌లోని పరిస్థితులు చూస్తే ఈ లెక్కలు నిజం కావచ్చేమో అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. భారత్‌లో ఎక్కడ చూసినా ఆసుపత్రులన్నీ కిటకిటలాడి పోతున్నాయి. వైద్య సిబ్బందీ అలసిపోయారు. వైరస్ బారిన పడుతున్నారు. ఏ సోషల్ మీడియా చూసినా ప్రజలు తీవ్ర నిరాశ నిస్పృహలతో... ఆక్సిజన్, ఆసుపత్రుల్లో పడకలు, ఇతర అవసరాల కోసం అర్థిస్తున్న పోస్టులే కనిపిస్తున్నాయి.
ఓవైపు కరోనా ఇంతగా విజృంభిస్తున్నా.. దేశంలో ఇప్పటివరకు కేవలం 2% మందికే వ్యాక్సినేషన్ పూర్తయింది. జాతీయ స్థాయిలో భారత్ వ్యాక్సినేషన్ ప్రణాళిక జోరందుకోవడం లేదు. వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది. పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్రాలతో సంప్రదింపులు జరపకుండానే అకస్మాత్తుగా తన వ్యాక్సిన్ విధానంలో మార్పులు చేసి 18 ఏళ్ల పైబడిన వారందరికీ కేంద్రం అనుమతిచ్చింది. ఈ పరిస్థితులన్నీ చూస్తే.. వచ్చే ఆగస్టు నాటికి భారత్‌లో 10 లక్షల మంది చనిపోవచ్చన్న అంచనాలు నిజంకావచ్చేమో అనిపిస్తోంది.