వైరస్ అనగానే నిరంతరం మార్పులు చెందుతూ మానవాళిని కలవరపెట్టే అంటువ్యాధి అని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వైరస్ కబంధ హస్తాలలో చిక్కుకుపోయింది. ఒక రోజులో వస్తున్న లక్షల్లో కేసులు, వేళల్లో మరణాలు ప్రజల్ని మరింత భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గత ఏడాది మొదట వచ్చిన కరోనా ఫస్ట్ వేవ్ కంటే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ మనుషుల  ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తోంది. రూపాంతరం చెందిన ఈ మహమ్మారి ప్రజలపై పగబట్టినట్టు విరుచుకుపడుతోంది. అయితే కరోనా వైరస్ కి మొదట్లో చికిత్స ఎలా చేయాలో తెలియక ఇబ్బందులు పడ్డ వైద్యనిపుణులు, ఇప్పుడు దీనిపై కాస్త అవగాహన పెరగడంతో సంబంధిత చికిత్సను కరోనా రోగులకు అందిస్తూ పేషెంట్లను కరోనా నుండి కాపాడేందుకు వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

ఈ మాయదారి వైరస్  శరీరంలోని అన్ని అవయవాలపై దాడి చేస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన మరో విషయం ప్రజల్ని భయపెడుతోంది. ఈ మధ్య కరోనా బారిన పడ్డ ఓ పేషెంట్ ని  గమనించగా  అతని రక్తనాళాలలో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు డాక్టర్లు. ఇదే సమస్యను మరో కొంతమంది కరోనా పీడిత వ్యక్తుల్లోనూ గమనించినట్లు తెలిపారు. ఇది కరోనా కారణంగా ఏర్పడిన సమస్య అని చెబుతున్నారు.  దీన్ని గుర్తించడం కనుక ఆలస్యమైతే ఆ పేషెంట్  హార్ట్ స్ట్రోక్ వంటి గుండె సంబంధిత వ్యాధుల బారిన పడతారని చెబుతున్నారు.

మే 5న న్యూ ఢిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్ కు చెందిన డాక్టర్ . అంబరీష్ సాత్విక్  ఓ పోస్టు ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా రోగి అవయవాల నుండి గడ్డకట్టిన రక్తాన్ని వేరు చేసి బయటకు తీస్తున్న  ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలా గడ్డకట్టిన రక్తాన్ని అవయవాల నుండి వేరు చేసి ఆ పేషెంట్ ప్రాణాలు నిలబెట్టామని పేర్కొన్నారు. దాంతో ఈ విషయం వైరల్ గా మారింది. కరోనాతో మరో కొత్త చిక్కు వచ్చి పడింది. కానీ కంగారు పడొద్దని డాక్టర్స్ చెబుతున్నారు. అయితే వెంటనే కనుక ఈ సమస్యను గుర్తించి ఆ గడ్డకట్టిన రక్తాన్ని వేరు చేయగలిగితే సమస్య ఏమీ ఉండదని చెబుతున్నారు వైద్యనిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: