రోజా...ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకురాలు. టీడీపీలో రాజకీయాలు మొదలుపెట్టి, వైసీపీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా...నెక్స్ట్ జగన్ కేబినెట్‌లో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అసలు మొదటి విడతలోనే రోజాకు మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. కానీ సామాజికవర్గాల సమీకరణాల్లో రోజాకు మంత్రి పదవి దక్కలేదు. అయితే మొదటి విడతలో ఛాన్స్ దక్కని వారికి రెండో విడతలో ఛాన్స్ ఇస్తానని జగన్ చెప్పారు.


రెండున్నర ఏళ్లలో జరిగే మంత్రివర్గ విస్తరణలో పనితీరు బాగోని మంత్రులని పక్కనబెట్టేసి కొత్తవారికి అవకాశం ఇస్తానని చెప్పారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతుంది. అంటే మరో ఆరు నెలల్లో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఇక అప్పుడు రోజాకు ఛాన్స్ రావొచ్చని ప్రచారం జరుగుతుంది. కానీ రోజాకు అంతా ఈజీగా అవకాశం రాకపోవచ్చని కూడా తెలుస్తోంది. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామిలు జగన్ కేబినెట్‌లో ఉన్నారు.


ఇందులో పెద్దిరెడ్డి పదవికి ఎలాంటి ఢోకా ఉండదని చెప్పాల్సిన పని లేదు. ఇక నారాయణస్వామి భవిష్యత్ జగన్ చేతిలో ఉంది. అయితే నెక్స్ట్ నారాయణస్వామిని పక్కనబెట్టి కొత్తవారికి ఛాన్స్ ఇస్తారా లేక మరొక పదవిని చిత్తూరు జిల్లాకు అదనంగా ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఎలా ఉన్నా సరే రోజాకు దక్కే మంత్రి విషయంలో పలువురు పోటీలో ఉన్నారు.


తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు మంత్రి పదవి ఆశించేవారిలో ఉన్నారు. అటు యువ ఎమ్మెల్యే వెంకటే గౌడ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సైతం రేసులో ఉన్నారని తెలుస్తోంది. ఇక ఇంత పోటీలో రోజాకు పదవి దక్కుతుందా అనే విషయం ప్రశ్నార్ధకంగానే ఉంది. మరి చూడాలి రోజాకు జగన్ మంత్రి పదవి ఇస్తారో లేక ఏ‌పి‌ఐ‌ఐ‌సి ఛైర్మన్‌గా కొనసాగిస్తారో?


మరింత సమాచారం తెలుసుకోండి: