కేరళలో మురుగుల అనే గిరిజన గ్రామం ఉంది. ఇది పాలక్కడ్‌లోని అటాపడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గిరిజన గ్రామంలో ముదుగర్, కురుంబ తెగలకు చెందిన వంద మంది నివసిస్తున్నారు. ఈ మాయదారి కరోనా ఆ ప్రాంతానికి కూడా విస్తరించింది. ఇక్కడ ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు జ్వరాలతో బాధపడుతున్నట్లు వైద్య శాఖకు సమాచారం వచ్చింది. అయితే వారికి కరోనా ఉందో లేదో తెలియదు. కానీ ఆ గ్రామంలో చాలామందికి కరోనా వచ్చి ఉండొచ్చని వైద్యులు భావించారు.
వారి లక్షణాలను బట్టి కరోనాయే అని భావించిన కేరళ వైద్యుల బృందం.. కారులో బయలుదేరింది. అయితే.. ఆ కారు ఓ నది వరకూ వెళ్లి ఆగింది. ఆ గ్రామానికి వెళ్లాలంటే నది దాటాల్సిందే. ఆ వైద్యులు నదిని దాటుకుని తరువాత అటాపడి అడవిలో 8 కిలోమీటర్ల దూరం కాలిన నడకనే వెళ్లారు. ఎట్టకేలకు మురుగల గ్రామానికి చేరుకున్నారు. గిరిజనులకు యాంటీజెన్ టెస్టులు చేశారు. మొత్తం 30మందికి ఈ టెస్టులు చేయగా..ఏడుగురు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
స్వల్ప లక్షణాలు ఉన్న వారికి మందులు అందజేసి.. కొందరిని దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు ఆ వైద్య బృందం. రోగుల కోసం ఈ వైద్యులు చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వారు నది దాటుతున్న దృశ్యాలు.. అడవిలో ప్రయాణం చేసిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. రోగుల కోసం సాహసం చేసిన డాక్టర్ల బృందాన్ని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ అభినందించారు.