జపాన్ దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ విజృంభిస్తోంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో జపాన్ మాత్రం కరోనా నాలుగో దశతో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా ఆ దేశంలోని ప్రధాన నగరమైన ఒసాకాలో కరోనా తీవ్రత విపరీతంగా పెరిగిపోతోంది. దేశంలో 1,413 మంది రోగుల ఆరోగ్య పరిస్థితి విషమించిందని అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. బుధవారం ఒక్కరోజే 116 మంది కరోనాతో చనిపోయారు. అదేరోజు 4,536 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. దాదాపు 13 కోట్ల మంది జపాన్ జనాభాలో 20 లక్షల మంది ప్రజలు ఒసాకా నగరంలోనే జీవిస్తున్నారు. జపాన్ లో టోక్యో తర్వాత ఒసాకా నగరమే అత్యధిక జనాభా కలిగి ఉంది.



అయితే అత్యధిక జనాభా గల ఈ నగరంలోనే కరోనా ఫోర్త్ వేవ్ తీవ్రరూపం దాల్చడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన వారం రోజుల్లోనే ఒసాకాలో 3,849 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ నగరంలో 410 మంది కరోనా రోగుల పరిస్థితి చాలా విషమంగా ఉంది. జపాన్ దేశం మొత్తంలో నమోదవుతున్న కరోనా మరణాల్లో 25% ఒసాకా నగరంలోనే నమోదవుతున్నాయి. ప్రతిరోజు కరోనా కేసులు పెరిగిపోతుండటం తో ఆస్పత్రులపై బాగా భారం పడుతోంది. దీంతో జపాన్ దేశం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది.



భారతదేశంలో వేల మందిని బలిగొంటున్న కరోనా వేరియంట్ తమ దేశంలో వ్యాప్తి చెందకుండా ఉండాలని జపాన్ అధికారులు బాగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే 29 మంది జపనీయులు ఇండియా కరోనా వేరియంట్ కి బాధితులు అయ్యారని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ డ్రైవ్ ని వేగవంతం చేయడంతో పాటు కరోనా నిబంధనలు కూడా కఠినతరం చేశారు. అలాగే కరోనా కట్టడి నిమిత్తం పలు నగరాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: