ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా సెకండ్‌వేవ్ కార‌ణంగా అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ న‌డుస్తోంది. దీంతో విద్యార్థుల ప్రాణాల‌ను దృష్టిలో ఉంచుకుని సీబీఎస్ ఈ ప‌రీక్ష‌ల‌ను అప్ప‌ట్లో వాయిదా వేసింది కేంద్ర ప్ర‌భ‌త్వం. అయితే వీటిని ఇప్పుడు మ‌ళ్లీ నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తోంది. జూన్ 1న రీ షెడ్యూల్ చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

అయితే ఈ నేప‌థ్యంలో సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది మమతా శర్మ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ మేర‌కు సీఐఎస్‌సీఈ బోర్డులకు ఆదేశాలు జారీ చేయాలంటూ ఈ పిటిషన్‌ను వేశారు. దీన్ని స్వీకరించిన జస్టిస్‌ ఖాన్విల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం.. తదుపరి విచారణను మే 31వ తేదీ(సోమవారం)కి వాయిదా వేసింది.

ఇక క‌రోనా తీవ్ర‌త కాస్త త‌గ్గుతుంటంతో సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను జూన్ 1కి రీ షెడ్యూల్ చేసిన‌ట్టు కేంద్ర విద్యాశాఖ ఇటీవ‌ల ప్రకటించింది. అప్ప‌టి నుంచి ప్ర‌తిప‌క్షాలు, ఇటు విద్యార్థులు భ‌గ్గుమంటున్నారు. ఇలాంటి క్లిష్ట స‌మ‌యాల్లో ప‌రీక్ష‌లు ఎలా నిర్వ‌హిస్తారంటూ మండిప‌డుతున్నారు. అయితే సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి పరీక్షలపై విద్యాశాఖ తదుపరి నిర్ణయం తీసుకోనుంది.

ఇదిలా ఉండ‌గా మరోవైపు సుప్రీం తీర్పుతో రాష్ట్రాల బోర్డులు కూడా 12వ తరగతి పరీక్షలపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో కూడా ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ఇటీవల కేంద్ర విద్యాశాఖ.. రాష్ట్రాలతో సమావేశమైంది. జులై 15 నుంచి ఆగస్టు 28 వరకు వీటిని నిర్వహించాలని భావిస్తున్నారు. మ‌రి సుప్రీంకోర్టు ఒక్క‌రోజు ముందు తీర్పు ఎలా ఇస్తుందో అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక్క‌రోజు ముందు ర‌ద్దు చేసే అవ‌కాశాలు చాలా త‌క్కువ అని నిపుణులు చెబుతున్నారు. మ‌రి తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: