చిత్తూరు జిల్లా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా. పేరుకు చంద్రబాబు సొంత జిల్లా గానీ ఇక్కడ టీడీపీ ఆధిపత్యం చాలా తక్కువ. గతంలో ఇక్కడ కాంగ్రెస్ ఆధిక్యం ఉంటే, ప్రస్తుతం వైసీపీ హవా కొనసాగుతుంది. ఇక చిత్తూరులో టీడీపీ హవా లేకపోవడానికి ప్రధాన కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న పెద్దిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడుసార్లు పీలేరు నుంచి గెలవగా, 2009లో పుంగనూరు నుంచి సత్తా చాటారు.


ఆ తర్వాత వైసీపీలోకి వచ్చి వరుసగా 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించి, పుంగనూరుని తన కంచుకోటగా మార్చేసుకున్నారు. గతంలో పుంగనూరు టీడీపీకి కాస్త అనుకూలంగా ఉండేది. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఆరు సార్లు గెలిచింది. కానీ పెద్దిరెడ్డి వచ్చాక పరిస్తితి మారిపోయింది. మొత్తం వైసీపీ హవా కొనసాగుతుంది. ఇక పెద్దిరెడ్డి హవాకు బ్రేక్ వేద్దామని 2019 ఎన్నికల్లో పుంగనూరులో టీడీపీ నేత, మాజీ మంత్రి అమ‌ర్‌నాథ్ రెడ్డి సొంత బంధువు(మ‌ర‌ద‌లు) అనీషా రెడ్డిని  బరిలో దింపారు.


గతంలో పుంగనూరులో రెండుసార్లు అమర్నాథ్ రెడ్డి టీడీపీ నుంచి గెలిచారు. అందుకే 2019 ఎన్నికల్లో పుంగనూరులో అనీషాని నిలబెట్టారు. ఎన్నికల సమయంలో అనీషా గట్టిగానే టీడీపీ తరుపున ప్రచారం చేశారు. అలాగే భారీగా ఖర్చు చేశారు. కొంత మేర‌కు పొలం కూడా అమ్మేసి ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు పెట్టార‌ని టాక్. కానీ ఎంత చేసిన పుంగనూరులో పెద్దిరెడ్డికి చెక్ పెట్టలేకపోయింది. పెద్దిరెడ్డి దాదాపు 42 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచేశారు.


అలాగే జగన్ కేబినెట్‌లో మంత్రి అయ్యారు. ఇక మంత్రిగా జగన్ ప్రభుత్వంలో ఎంత కీలకంగా పనిచేస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండేళ్లలో పెద్దిరెడ్డి మరింత స్ట్రాంగ్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంగనూరులో టీడీపీకి ప్లేస్ లేకుండా చేశారు. దీంతో పుంగనూరులో టీడీపీకి ఆశలు లేకుండా పోయాయి. అనీషా సైతం పార్టీలో యాక్టివ్‌గా ఉండటం లేదు. నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో కూడా తెలియదు. ఒకవేళ బరిలో దిగిన గెలుపు దక్కడం సులువు కాదు. మొత్తానికైతే పుంగనూరుపై టీడీపీ ఆశలు వదులుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: