కృష్ణా జిల్లా టీడీపీలో కమ్మ నేతల హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో మిగిలిన సామాజికవర్గాలతో పోలిస్తే, కమ్మ నేతలకు సీట్లు ఎక్కువగా వస్తాయి. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున ఐదుగురు కమ్మ నేతలు పోటీ చేశారు. జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉంటే 5చోట్ల కమ్మ నేతలకే సీటు దక్కింది. విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్, పెనమలూరు నుంచి బోడే ప్రసాద్, మైలవరం నుంచి దేవినేని ఉమా, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, గుడివాడ నుంచి దేవినేని అవినాష్‌లు పోటీ చేశారు.
అయితే ఇందులో వంశీ, గద్దెలు మాత్రమే గెలిచారు. మిగిలిన ముగ్గురు ఓడిపోయారు. ఇక వైసీపీ అధికారంలోకి రావడంతో వంశీ, దేవినేని అవినాష్‌లు వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. వంశీ వైసీపీ వైపుకు వెళ్ళడంతో గన్నవరంలో బీసీ సామాజికవర్గానికి చెందిన బచ్చుల అర్జునుడుని ఇన్‌చార్జ్‌గా పెట్టారు. అటు దేవినేని వైసీపీలోకి వెళ్ళి విజయవాడ తూర్పు ఇన్‌చార్జ్‌గా సెటిల్ అయ్యారు. దీంతో గుడివాడలో మళ్ళీ కమ్మ వర్గానికి చెందిన రావి వెంకటేశ్వరావుని ఇన్‌చార్జ్‌గా పెట్టారు.
ఇక మైలవరంలో దేవినేని ఉమా, పెనమలూరులో బోడే ప్రసాద్‌లు పనిచేస్తున్నారు. అటు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా గద్దె ఉన్నారు. అయితే అవినాష్ వైసీపీలోకి వచ్చాక, గద్దె బలం తగ్గింది. తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఆధిక్యత పెరిగింది. ఇటీవల విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలో కూడా వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
అటు మైలవరంలో దేవినేని ఉమా గట్టిగానే పోరాడుతున్నారుగానీ, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు వల్ల వైసీపీ ఎమ్మెల్యేకు అడ్వాంటేజ్ అవుతుంది. పెనమలూరులో బోడే ప్రసాద్‌ది కూడా అదే పరిస్తితి. కాకపోతే గద్దె, దేవినేని, బోడేలకు మళ్ళీ పుంజుకునే ఛాన్స్ లేకపోలేదు. కానీ గుడివాడలో రావికి మాత్రం మళ్ళీ ఛాన్స్ వచ్చేలా కనిపించడం లేదు. ఇక్కడ కొడాలి నాని దెబ్బకు టీడీపీ అడ్రెస్ లేకుండా పోయింది. కాబట్టి గుడివాడలో రావికి భవిష్యత్‌లో గెలిచే ఛాన్స్ తక్కువగా కనిపిస్తోంది.