జగన్ దెబ్బకు ఏపీలో సైకిల్ అడ్రెస్ లేకుండా పోతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి ఏపీలో టీడీపీ పుంజుకోలేకపోతుంది. జగన్ హవా ముందు సైకిల్ నేతలు తేలిపోతున్నారు. ఎన్నికలై రెండేళ్ళు అయిన సరే చాలాచోట్ల టీడీపీకి సరైన నాయకత్వం లేదు. ముఖ్యంగా ప్రతి ఎన్నికల్లో కీలకంగా ఉండే ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ వీక్‌గా కనిపిస్తోంది.
ఈ జిల్లాల్లో ఉన్న ఐదు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ వీక్‌గానే కనిపిస్తోంది. పశ్చిమ గోదావరిలో నరసాపురం, ఏలూరు స్థానాలు ఉండగా, తూర్పు గోదావరిలో అమలాపురం, కాకినాడ, రాజమండ్రి స్థానాలు ఉన్నాయి. అయితే పార్టీ బలోపేతం చేయడానికి చంద్రబాబు పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించారు. కానీ పార్లమెంట్ అధ్యక్షులు బాగా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. ఐదు పార్లమెంట్ స్థానాల్లో అధ్యక్షులు దూకుడు కనబర్చడం లేదు.
పైగా ఐదు స్థానాల్లో టీడీపీ ఇన్‌చార్జ్‌లు సైతం సరిగ్గా లేరు. మొదట ఏలూరులో మాగంటి బాబు సైలెంట్‌గా ఉన్నారు. 2014లో గెలిచిన బాబు, 2019లో ఓడిపోయారు. అయితే ఇటీవల మాగంటి ఇద్దరు కుమారులు మరణించారు. దీంతో మాగంటి రాజకీయాల వైపుకు రావడం లేదు. అటు నరసాపురంలో ఓడిపోయిన వేటుకూరి శివరామరాజు సైతం పార్టీలో అడ్రెస్ లేరు. నెక్స్ట్ ఎన్నికల్లో ఈయన మళ్ళీ నరసాపురం నుంచి పోటీ చేయడం డౌటే.
ఇక రాజమండ్రిలో మురళీమోహన్ కోడలు మాగంటి రూప పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక రూప సైతం పార్టీలో కనిపించడం లేదు. మళ్ళీ రాజమండ్రి పరిధిలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం ఒక్కటీ చేయడం లేదు. అటు కాకినాడలో చలమలశెట్టి సునీల్ పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక సునీల్ వైసీపీలోకి వెళ్లారు. సునీల్ వెళ్లిపోయాక కాకినాడకు మరో ఇన్‌చార్జ్‌ని పెట్టలేదు. అటు అమలాపురంలో మాత్రం దివంగత బాలయోగి కుమారుడు హరీష్ కాస్త యాక్టివ్‌గా ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన సరే పార్టీని బలోపేతం చేసేందుకు కష్టపడుతున్నారు. మొత్తానికైతే నాలుగు పార్లమెంట్ స్థానాల్లో సైకిల్ తోక్కేవాళ్లు కావాలి.