ఒడిశాలోని కలహందిలో పుట్టే వంశధార నది అక్కడి నుంచి మన రాష్ట్రంలోని శ్రీకాకులం జిల్లాలోకి ప్రవహిస్తోంది.  ఉత్త‌రాంధ్ర‌లో శ్రీకాకుళం జిల్లాకు వంశ‌ధార న‌దీ జలాలు ఎంత ఉప‌యోగ‌మో తెలిసిందే. అయితే కొద్ది సంవ‌త్స‌రాలుగా వంశ‌ధార న‌దీ జ‌లాల‌పై ఒడిశా ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తూ వ‌స్తోంది. దీంతో వంశధార నదికి సంబంధించి ఏపీ, ఒడిశా మధ్య వివాదాలు ఉన్నాయి.  వంశ‌ధార న‌దీ జ‌లాల ఆధారంగా ఏపీ ప్ర‌భుత్వం నేర‌డి ప్రాజెక్టు నిర్మించాల‌ని త‌ల‌పెట్టింది. అయితే దీనిపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన ఒడిశా ప్ర‌భుత్వం కొర్రీలు పెట్టింది. ఈ ప్రాజెక్టు భూసేక‌ర‌ణ‌పై రెండు మ‌ధ్యంత‌ర పిటిష‌న్లు దాఖ‌లు కావ‌డంతో వంశ‌ధార ట్రిబ్యున‌ల్ తీర్పు వెలువ‌రించింది. ప్రాజక్టు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి అవసరమైన భూసేకరణపై ఒడిశా దాఖలు చేసిన పిటిషన్‌పై ట్రిబ్యున‌ల్‌ ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ ప్రాజెక్టుపై కొర్రీలు వేసిన ఒడిశా ఏపీ ప్ర‌భుత్వం చెప్పిన విధంగా 106 ఎక‌రాల్లో ప్రాజెక్టు నిర్మించ‌డం సాధ్యం కాద‌ని.. ఏపీ ప్ర‌భుత్వం ప్రాజెక్టుకు సంబంధించిన స‌మ‌గ్ర ప్లాన్ కూడా ఇవ్వ‌లేద‌ని ఆరోపించింది. ఈ వివాదంపై దాఖ‌లు అయిన రెండు ఐఎలపై విచారణ అనంతరం వంశధార ట్రైబ్యునల్ తుది ఉత్తర్వులు వెలువరించింది. అయితే ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన భూసేక‌ర‌ణ విష‌యంలో ఒడిశా అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో ఆ భూసేక‌ర‌ణ బాధ్య‌త ఒడిశా ప్ర‌భుత్వం మీదే పెట్టి షాక్ ఇచ్చింది.

ప్రాజెక్టు నిర్మాణంతో పాటు ఆపరేషన్‌, మెయింటినెన్స్‌, నీటి పంపకాల విషయంలో విభేదాల పరిష్కారానికి ఒక అప్పీల్‌ అథారిటీ ఏర్పాటు చేయాలని, నీటి పంపకాల్లో స్పష్టత కావాలని కేంద్రం మ‌రో ఐఎ దాఖలు చేసింది. ఇక ఈ వివాదాలు, విబేధాల‌ను ప‌రిష్క‌రించే బాధ్య‌త‌ను కేంద్ర జలశక్తి, జలసంఘం అధికారులపై పెట్ట‌డంతో పాటు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి సమీక్షించే అధికారం ఉందని ట్రిబ్యున‌ల్‌ చెప్పింది. ఇక వంశధార నదీ జలాలను ఇరు రాష్ట్రాలు చెరి సగం వాడుకోవాల్సి ఉంది. 115 టీఎంసీల అంచ‌నాల‌తో గ‌తంలోనే ఈ ఒప్పందం కుదిరింది.



 

మరింత సమాచారం తెలుసుకోండి: