ఎన్ని సార్లు. .. ఎక్కడ పోటీ చేసినా కూడా కేసీఆర్ వరుసగా గెలుస్తూనే వస్తున్నారు. 2001లో టీఆర్ ఎస్ పార్టీ పెట్టాక కేసీఆర్‌కు ఓటమి అనేదే లేదు. ఆ మాటకు వస్తే ఆ ఫ్యామిలీలో కేటీఆర్, హరీష్ రావుకు కూడా ఓటమి లేదు. గత ఎంపీ ఎన్నికల్లో నిజామాబాద్‌లో కేసీఆర్ కుమార్తె కవిత మాత్రమే ఓడిపోయారు. ఇక ఇప్పుడు గజ్వేల్లో నీటి ప్రాజెక్టుల భూసేకరణ విషయంలో టీఆర్ ఎస్ ప్రభుత్వంతో పాటు కేసీఆర్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని పార్టీ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది.
ఇక వచ్చే ఎన్నికల్లో ఆయన గజ్వేల్ నుంచి కాకుండా ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని రాజకీయ మేథావుల్లో కొత్త చర్చ స్టార్ట్ అయ్యింది. తనపై ఉన్న వ్యతిరేకత కేసీఆర్ తెలుసుకోలేనోడు కాదు. అందుకే ఆయన యాదాద్రి ఆలయాన్ని ఇక్కడ అభివృద్ధి చేస్తోన్న నేపథ్యంలో ఆయన కన్ను ఆలేరుపై పడిందంటున్నారు. ఆలేరు, గజ్వేల్ పక్క పక్క నియోజకవర్గాలే. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ఆలేరు టీఆర్ ఎస్‌కు కంచుకోట. 2004, 2008 ఉప ఎన్నిక, 2014, 2018 ఎన్నికల్లో ఇక్కడ కారు పార్టీ నాలుగు సార్లు గెలిచింది.
ఇక తాజాగా ఆయన వాసాలమర్రిని దత్తత తీసుకుని బంగారు వాసాలమర్రి చేస్తానని ప్రకటనలు చేస్తూ ఆలేరులో మంచి హైప్ తెస్తున్నారు. దీని వెనక ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. మరి కేసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందో ? చూడాలి.