ఏపీలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో బాపట్ల స్థానం ఒకటి. ఈ స్థానంలో టీడీపీలో మంచి విజయాలే నమోదు చేసింది. ఈ స్థానంలో టీడీపీ అయిదుసార్లు గెలిచింది. ఇక గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ చాలా తక్కువ మెజారిటీతో గెలిచింది. రాష్ట్రంలో జగన్ వేవ్ ఉన్నా సరే బాపట్లలో వైసీపీకి ఎక్కువ మెజారిటీ రాలేదు.
ఎందుకంటే బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉన్న నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. రేపల్లె, పర్చూరు, చీరాల, అద్దంకి స్థానాల్లో టీడీపీ గెలవగా, బాపట్ల, వేమూరు, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచింది. అయితే వైసీపీ గెలిచిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ మెజారిటీలు రావడంతో బాపట్ల పార్లమెంట్ స్థానం వైసీపీ వశమైంది.
అలా వైసీపీ వశమైన బాపట్ల స్థానాన్ని దక్కించుకోవడం కోసం టీడీపీ గట్టిగానే కష్టపడుతుంది. బాపట్ల పార్లమెంటరీ అధ్యక్షుడుగా ఏలూరి సాంబశివరావు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈయన పర్చూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. పర్చూరులో స్ట్రాంగ్‌గా ఉన్న ఏలూరి, బాపట్ల పరిధిలో ఉన్న మిగతా స్థానాల్లో టీడీపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. అటు అద్దంకిలో టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో గొట్టిపాటికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ టీడీపీకి ప్లస్ అవుతుంది.
అటు రేపల్లెలో అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈయన పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. కాబట్టి ఈయన్ని రేపల్లెలో యాక్టివ్ చేయాల్సిన అవసరముంది. కాకపోతే రేపల్లెలో టీడీపీ కేడర్ స్ట్రాంగ్‌గా ఉంది. అటు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీ వైపుకు వెళ్ళడంతో అక్కడ పార్టీ పరిస్తితి కాస్త ఇబ్బందుల్లోనే ఉంది. ఇక్కడ టీడీపీని బలోపేతం చేయాల్సిన అవసరముంది. వేమూరులో నక్కా ఆనందబాబు, బాపట్లలో వేగేశన సతీశ్‌లు గట్టిగానే కష్టపడుతున్నారు. సంతనూతలపడులో టీడీపీ ఇంకా పుంజుకోవాలి. కానీ మొత్తం మీద చూస్తే బాపట్ల పార్లమెంట్ పరిధిలో సైకిల్ స్పీడ్ కాస్త పెరిగిందనే చెప్పొచ్చు.