ఔను! రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి నేత‌లు ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. మ‌ళ్లీ వైసీపీనే అధికారంలోకి వ‌స్తుంద‌నే అంచ‌నాలు వేసుకుంటున్న ఆ పార్టీ నేత‌లు.. ఇప్పుడు మ‌రోసారి త‌మ స‌త్తా చాటుకునేందుకు ప్ర‌య‌త్నాలు ఇప్ప‌టి నుంచే ప్రారంబించారు. వీరిలో తూర్పుగోదావ‌రి జిల్లా రామ‌చంద్ర‌పురం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నేత‌లు.. చాలా దూర‌దృష్టితో ఉన్నార‌ని చ‌ర్చ న‌డుస్తుండ‌డం గ‌మ‌నార్హం. రామ‌చంద్ర‌పురం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయిన తోట త్రిమూర్తులు.. ఇక్క‌డ నుంచి గెలిచి.. మంత్రి కూడా అయిన‌ చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌ల‌తోపాటు.. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న మాజీ మంత్రి పిల్లి సుభాశ్ చంద్ర‌బోస్‌లుఇదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వారు.

అంతేకాదు. .ప్ర‌స్తుతం వీరు ముగ్గురూ కూడా ఒకే పార్టీలో ఉన్నారు. అదేస‌మ‌యంలో ఇటీవలే.. తోట‌కు ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో పొగ‌లు, సెగ‌లు.. వివాదాలు త‌గ్గుతాయ‌ని జ‌గ‌న్ భావించారు. ఆయ‌న వ్యూహం బాగానే ఉంది. కీల‌కంగా ఉన్న ముగ్గురు నేత‌ల‌కు మూడు ప‌ద‌వులు ఇచ్చారు క‌నుక‌.. ఇక‌, పార్టీ ప‌రంగా దూకుడు చూపిస్తార‌ని ఆయ‌న భావించారు. కానీ, జ‌గ‌న్ ఆశించింది.. అనుకున్న‌ది ఒక‌టైతే.. వీరు మ‌రో రూట్‌లో వెళ్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టి నుంచే ప్రిపేర్ అవుతున్నారు. వీరిలో తోట , బోస్‌కు ఎలాగూ.. ఎమ్మెల్యే టికెట్ ద‌క్క‌ద‌నే విష‌యం క‌న్ఫ‌ర్మ్ అయింది.

ఎందుకంటే.. వారిద్ద‌రూ పెద్ద‌ల స‌భ‌కు నామినేట్ అయ్యారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వారి స‌భ్య‌త్వాలు యాక్టివ్గానే ఉంటాయి. అయినా స‌రే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రామ‌చంద్ర‌పురం టికెట్‌ను వ‌దులుకోవ‌డం వీరికి ఇష్టం లేదు. ఈ క్ర‌మంలో ఈ ఇద్ద‌రూ కూడా త‌మ త‌మ వార‌సుల‌ను రంగంలోకి దింపారు. ఇప్ప‌టికే తోట త్రిమూర్తులు కుమారుడిని జ‌గ‌న్‌కు ప‌రిచ‌యం చేశారు. ఇక‌, బోస్ త్వ‌ర‌లోనే కుమారుడిని తీసుకుని జ‌గ‌న్ ను క‌ల‌వ‌నున్నార‌ని రామ‌చంద్ర‌పురంపై హామీ తీసుకుంటార‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.

మ‌రి ఈఇద్ద‌రూ ఇలా ప్ర‌య‌త్నిస్తుంటే.. ప్ర‌స్తుతం మంత్రిగా వేణు మాత్రం ఊరుకుంటారా.? ఆయ‌న కూడా త‌న‌దైన శైలిలో దూకుడు పెంచారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈటికెట్‌ను త‌న‌కు చేజారి పోకుండా చూసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ ఇద్ద‌రి వ్యూహాల‌పై ప్ర‌తివ్యూహాలు వేసి.. ఇక్క‌డ తిరిగి గెలిచేలా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో ఒక టికెట్టు.. ముగ్గురి విన్యాసం అన్న‌విధంగా రామ‌చంద్ర‌పురం ప‌రిస్థితి మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: