
మన దేశంలో కరోనా భయానికి చాలా మంది మాస్కులు పెట్టుకుంటున్నా.. కరోనా కాస్త కట్టడిలోకి వచ్చిన దేశాల్లో మాస్కులు పెట్టకోవడం అంతగా కనిపించడం లేదు. ఇక కొన్ని ప్రభుత్వాలు కాస్తో కూస్తో కరోనా తగ్గగానే మాస్కులు అవసరం లేదు అని ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు అమెరికా వంటి కొన్ని దేశాల్లో మాస్కులు మస్ట్ కాదు. అక్కడ రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకున్న వారు మాస్కు లేకుండానే తిరగొచ్చు.
ఇంకా మరికొన్ని దేశాలు కూడా ఇలాంటి ప్రకటనలే చేశాయి. కానీ.. ఇప్పుడు క్రమంగా సీన్ మళ్లీ మారుతోంది. అవే దేశాలు మళ్లీ ఇప్పుడు మస్కులు తప్పనిసరి అని ప్రకటనలు చేస్తున్నాయి. ఎందుకంటే ఆ దేశాల్లో మాస్కులు పెట్టుకోకపోవడం వల్ల మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. అందుకే ఆయా దేశాల్లో మళ్లీ మాస్కులు పెట్టుకోవాలన్న నిబంధనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక ప్రపంచం మొత్తానికి ఆరోగ్యానికి సంబంధించి సూచనలు చేసే ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కరోనా కట్టడి విషయంలో మాస్కు తప్పనిసరి అని మరోసారి పునరుద్ఘాటించింది.
కరోనా తగ్గగానే మాస్కులు వద్దని చెప్పడం సరికాదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ మాస్కు ద్వారానే కరోనా వ్యాప్తిని ఆపగలమని ప్రకటించింది. అందుకే మాస్కు ఒక్కటే మనల్ని కరోనా నుంచి కాపాడుతుంది. కాస్త కరోనా జోరు తగ్గిందనగానే మాస్కులు వదిలేసి తిరగడం ఏ మాత్రం మంచిది కాదని గుర్తుపెట్టుకోవాలి. ఏమంటారు.