ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటికి సంబంధించిన విషయంలో మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీ కడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం మాట్లాడుతుంది. ఆ ప్రాజెక్టుని అక్రమంగా కడుతున్నారని తెలంగాణ మంత్రులు, ఏపీలోని జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. విచిత్రం ఏంటి అంటే చనిపోయిన వైఎస్సార్‌ని సైతం రాజకీయాల్లోకి లాగి తెలంగాణ మంత్రులు తిడుతున్నారు.


మరి తెలంగాణ మంత్రులు రాజకీయంగా ఎలాంటి లబ్ది పొందటానికి వైఎస్సార్‌ని సైతం తిడుతున్నారో తెలియదు గానీ, వైఎస్సార్‌ని తిట్టినా సరే వైసీపీ మంత్రులు పెద్దగా స్పందించడం లేదు. తాము సమన్వయంతో ఉన్నామని అంటున్నారు. తెలంగాణ నేతల మాదిరిగా మాత్రం ఏపీ నేతలు దూకుడుగా మాట్లాడటం లేదు. పైగా తాము ఏమన్నా మాట్లాడితే తెలంగాణలో ఉన్న తమ ప్రజలకు ఏదైనా ఇబ్బంది రావోచ్చని మాట్లాడుతున్నారు.


అంటే ఏపీ నేతలు ఏ కోణంలో ఇలా మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదని, తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజలు ప్రశాంతంగానే ఉన్నారని, అలాంటి సమయంలో ఇలా ఎందుకు కామెంట్లు వస్తున్నాయో తెలియడం లేదంటున్నారు. కానీ ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాల రాజకీయంగా లబ్ది పొందటం కోసమే ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గతంలో కేసీఆర్-చంద్రబాబులు కంటే పెద్ద సఖ్యత లేదు. కానీ జగన్-కేసీఆర్‌లకు ఎలాంటి సఖ్యత ఉందో అందరికీ తెలుసు. ఏపీలో జగన్ గెలుపు కోసం కేసీఆర్ పనిచేశారనే వాదన కూడా ఉంది. ఇక గెలిచాక కేసీఆర్-జగన్‌లు పలుసార్లు కలిశారు. చాలా సమస్యలని పరిష్కరించుకున్నారు.


మరి అంత క్లోజ్‌గా ఉండే జగన్-కేసీఆర్‌లు ఈ విషయంలో ఎందుకు కూర్చుని మాట్లాడుకోవడం లేదని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మళ్ళీ ఇంకోసారి కలిసి ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని మాట్లాడుతున్నారు. అలాగే ఈ మాటల యుద్ధానికి బ్రేక్ వేయొచ్చని అంటున్నారు. కానీ ఇద్దరు నేతలు అలా మాట్లాడుకునే వాతావరణం కనిపించడం లేదని, మరి ఈ రచ్చ ఎంతకాలం నడుస్తుందో చూడాలి అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: