రాజకీయాల్లో రాణించాలంటే పార్టీ బలం తో పాటు మీడియా సపోర్ట్ ఎంతో అవసరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఒక్కో రాజకీయ పార్టీకి సపరేట్ మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. ఒకవేళ మీడియా సంస్థలు లేనట్లయితే వాళ్లు ఒక మీడియా సంస్థ ను స్థాపించి వారి భావ‌జాలాన్ని వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. అలా కుదరకపోతే మీడియా సంస్థల అధినేత ల తో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. అయితే బయటకు చెప్పకపోయినా ప్ర‌స్తుతం ఉన్న అన్ని పార్టీల‌కు ఏదో ఒక‌ మీడియా సంస్థ సపోర్ట్ ఉంద‌న్న సంగ‌తి ప్రజలందరికీ తెలుసు. ఇదిలా ఉండగా జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ కు ముందు నుండి మీడియా సపోర్ట్ చాలా తక్కువ అన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని జనసైనికులు పదేపదే చెబుతుంటారు. తమ అభిమాన హీరో సేవా కార్యక్రమాలు చేసినా... ఇతర కార్యక్రమాలు నిర్వహించినా మీడియా సపోర్ట్ ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తారు. 

ఇటీవల కరోనా వేళ సోనూసూద్ చేసిన సేవ కార్యక్రమాలకు మీడియాలో ఎక్కువ ప్రచారం చేయగా పవన్ చేసిన సేవా కార్యక్రమాలు మీడియా లో తక్కువ కనిపించడం పై కూడా పవన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల్లో హీరోగా రానించారు. ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కానీ మీడియా స‌పోర్ట్ మాత్రం త‌క్కువే. అయితే పవన్ కు మీడియా సపోర్ట్ పెద్దగా లేక పోవడానికి కారణం ఆయన ముందు నుండి మీడియా వాళ్లతో పెద్దగా సత్సంబంధాలు పెట్టుకోక‌పోవ‌డమేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. కానీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డికి మాత్రం మీడియా సపోర్ట్ గట్టిగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రేవంత్ రెడ్డి సినిమాల్లో నుండి రాక‌పోయినా తెలంగాణలో కేసీఆర్ కు ప్రతిపక్షంగా ఎదిగారు. 

దానికి కారణం రేవంత్ రెడ్డి ఇదివరకు తెలంగాణ నుండి తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. దాంతో రేవంత్ కు పలు మీడియా ఛానల్ ల‌తో సంబంధాలున్నాయని టాక్. అంతేకాకుండా రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా బాధ్యతలు తీసుకునే ముందు పలు మీడియా  సంస్థ‌ల అధినేత‌ను  మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి కూడా తెలిసిందే. మరోవైపు రేవంత్ రెడ్డి త‌న వాక్ చాతుర్యంతోనూ ఆక‌ట్టుకుంటారు. అలా మీడియా లో ఫోక‌స్ అవుతుంటారు. ఇక రేవంత్ రెడ్డి దూకుడు మ‌రోవైపు మీడియా స‌పోర్ట్ తో తెలంగాణలో సీఎంగా ఎదుగుతారని కూడా పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: